సంగారెడ్డి,మనవార్తలు ప్రతినిధి :
మోదీ 25 ఏళ్ల పాలన దేశ సుపరిపాలనకు ప్రతీక అని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంగారెడ్డిలో నిర్వహించిన ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా సేవా జ్యోతి యాత్ర కు ఎమ్మెల్సీ డా. చిన్నమల్లె అంజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు .అనంతరం మాట్లాడుతూ సహకార సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. గత పాలకుల కాలంలో తెలంగాణ అప్పులు రూ. 10 లక్షల కోట్లు దాటితే, గత పన్నెండేళ్లలో మోదీ సర్కార్ రాష్ట్ర అభివృద్ధికి అక్షరాలా రూ. 12 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించిందని స్పష్టం చేశారు. పన్నుల వాటా కింద రూ. 2.52 లక్షల కోట్లు అందగా, ఒక్క ఈ ఏడాదే రూ. 33,180 కోట్లు మంజూరయ్యాయని, విపత్తుల వేళ ఎస్డీఆర్ఎఫ్ కింద రూ. 2,219 కోట్లు, ఎస్డీఎంఎఫ్ కింద రూ. 555 కోట్లు కేంద్రం అందించి ఆదుకుందని పేర్కొన్నారు.స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు పంచాయతీలకు రూ. 9,968 కోట్లు, మున్సిపాలిటీలకు రూ. 11,548 కోట్లు కేటాయించగా, జాతీయ రహదారుల అభివృద్ధికి రూ. 1.85 లక్షల కోట్లు వెచ్చించి ఇప్పటికే 5 వేల కిలోమీటర్ల పనులు పూర్తి చేసినట్లు తెలిపారు.
ఉమ్మడి ఏపీలో రైల్వేలకు కేవలం రూ. 886 కోట్లు ఇస్తే, నేడు ఒక్క తెలంగాణకే రూ. 5,454 కోట్లు కేటాయించడంతో పాటు రూ. 47,984 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయని, దేశంలోని 7 హైస్పీడ్ కారిడార్లలో 3 హైదరాబాద్ నుంచే ఉండటం విశేషమని అన్నారు.బయోఫార్మా ‘శక్తి’ కోసం రూ. 10 వేల కోట్లు, నైపర్ స్థాయి పెంపుతో హైదరాబాద్ గ్లోబల్ హబ్‌గా మారుతోందని, ఎస్ఏఎస్సీఐ కింద రూ. 9,502 కోట్లతో ఎంఎంటీఎస్ ఫేజ్-2, స్మార్ట్ సిటీలు, రామప్ప ఆలయం, సోమశిల వెల్నెస్ కేంద్రాల అభివృద్ధికి బాటలు వేశారని చెప్పారు. ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ పెంపు, ఎరువుల సబ్సిడీకి అదనంగా రూ. 7 వేల కోట్లు కేటాయించడంతో పాటు, పీఎం స్వానిధి ద్వారా 7.75 లక్షల మంది చిరువ్యాపారులకు రుణాలు అందించి మోదీ సర్కార్ అండగా నిలిచిందన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, జిల్లా ఇంచార్జి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వర్ రావు దేశ్ పాండే, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మాణిక్ రావు, జగన్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్, బీజేవైఎం రాష్ట్ర నాయకులు నరేన్, తదితరులు ఉన్నారు. అనంతరం సంగారెడ్డి పట్టణంలోని పాత బస్సు స్టాండ్ నుంచి జూబ్లీ క్లబ్ వరకు ప్రదర్శన చేపట్టారు.
