పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఓటర్ల జాబితాలో అక్రమంగా ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్ల నమోదు పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని, దీనిపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఐఎన్ టీయూసి పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొల్కూరి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం రోజున నాయకులతో కలిసి ఆయన తహసీల్దార్ గారికి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కొల్కూరి నరసింహారెడ్డి మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాలరాసే విధంగా ఓట్ల చోరీ జరుగుతోందని మండిపడ్డారు. ఇప్పటికే నియోజకవర్గంలో 30 శాతానికి పైగా, అంటే సుమారు 90 వేల ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారిన ఈ అక్రమాలపై రెవెన్యూ యంత్రాంగం తక్షణమే స్పందించాలని కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్న అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే పరిశీలించాలని, పారదర్శక విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, ఎన్నికల ప్రక్రియపై ప్రజల నమ్మకాన్ని కాపాడే బాధ్యత ఎన్నికల సంఘంపైనే ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి ,మాజీ పీసీసీ కార్యదర్శి మతీన్, కాంగ్రెస్ నాయకులు చంద్రయ్య, జంగయ్య, ఐఎన్ టీయూసి నాయకులు సుబ్బయ్య ,మధుసూదన్ రెడ్డి, మహేందర్, రాములు తదితరులు పాల్గొన్నారు.
