మనవార్తలు ప్రతినిధి,తెల్లాపూర్:
పటాన్చెరువు నియోజకవర్గంలోని తెల్లాపూర్‌లో రూ.48 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక ప్రభుత్వ పాఠశాల నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఎకరా స్థలంలో నిర్మించే ఈ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన అందించనున్నారు. డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు, లైబ్రరీ, ఆటస్థలాలతో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 17న పాఠశాల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడమే లక్ష్యం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లేపల్లి సోమిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు దేవేందర్ యాదవ్, మాజీ కౌన్సిలర్స్, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
