మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడని పటాన్చెరు మండల ఇన్చార్జి, మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపల్ లోని తన కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు . అనంతరం గడీల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ చరిత్రలో ధైర్యసాహసాలకు, సామాజిక సమానత్వానికి, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు. సామాన్య ప్రజలపై జరుగుతున్న దోపిడీ, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన గొప్ప వీరుడు పాపన్న గౌడ్ అని అన్నారు.సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, గౌరవం దక్కాలనే ఆశయంతో సర్వాయి పాపన్న గౌడ్ సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆయన ధైర్యం, పట్టుదల, ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.తెలంగాణ చరిత్రలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవలు, పోరాటాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కృష్ణ గౌడ్,దీపక్ గౌడ్,షకీల్,వినయ్ గౌడ్,సల్మాన్,షర్పుద్దీన్,వినీత్ రెడ్డి,ఆర్బాజ్,సాయి కుమార్ పాల్గొన్నారు
