_కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
_పటాన్చెరులో ఘనంగా సంబురాలు
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా మారబోతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషించనున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించిన సందర్భంగా పటాన్చెరువు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్వర్యంలోటిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. అనంతరం పటాన్చెరువు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సంబరాలు నిర్వహించారు. టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన పటాన్చెరువు టిఆర్ఎస్ నాయకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మతతత్వ రాజకీయాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన బిజెపికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో, దేశ రాజకీయాల్లో టిఆర్ఎస్ పార్టీ పెను సంచలనాలు సృష్టించబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.