మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని దాదా హరిత డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘సాధారణీకరించిన మెట్రిక్ ప్రదేశాలలో స్థిర బిందు సిద్ధాంతం, దాని అనువర్తనాలపై ఒక అధ్యయనం’ చేసి, ఆమె సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ గణిత శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణ కుమ్మరి, సహ-మార్గదర్శి డాక్టర్ కె.రామకోటేశ్వరరావు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ సిద్ధాంత వ్యాసం, సంక్లిష్టమైన గణిత సమ్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించే గణితశాస్త్రంలోని ఒక ముఖ్యమైన శాఖ అయిన ఫిక్స్ డ్ పాయింట్ థియరీ రంగానికి ముఖ్యమైన తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. ఈ పరిశోధన, జనరలైజ్డ్ మెట్రిక్ స్పేసెస్ లో ఇప్పటికే ఉన్న పరిజ్జానాన్ని బలపరిచే, భవిష్యత్తు పరిశోధనలకు పటిష్టమైన పునాదిని వేసే అనేక నూతన సైద్ధాంతిక ఫలితాలను అందిస్తుందన్నారు.ఈ పరిశోధన ఫలితాలు పరిశోధకులకు ప్రయోజనం చేకూర్చి, గణితం, సైన్స్, ఇంజనీరింగ్ లో మరింత పురోగతిని ప్రోత్సహిస్తాయని ఆశిస్తున్నట్టు తెలియజేశారు.డాక్టర్ హరిత సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం.రెజా, గణిత, గణాంక శాస్త్ర విభాగాధిపతి డాక్టర జాదవ్ గణేష్, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
