ఆర్బీఐ కేంద్ర బోర్డులో అనధికార డైరెక్టర్ గా సయ్యద్ అక్బరుద్దీన్ నియామకం

Telangana

హర్షం వెలిబుచ్చిన గీతం యాజమాన్యం, సంతోషాన్ని వ్యక్తపరిచిన కౌటిల్యా అధ్యాపకులు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ డీన్, ఐక్యరాజ్య సమితిలో భారత మాజీ రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కేంద్ర బోర్డులో పార్ట్-టైమ్, అనధికారిక డైరెక్టర్ గా నియమితులయ్యారు. నాలుగేళ్ల కాల పరిమతి గల ఈ నియామక ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయి..భారత ప్రభుత్వానికి క్యాబినెట్ నియామకాల కమిటీ సచివాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ, సిబ్బంది-శిక్షణ విభాగం అండర్ సెక్రటరీ (ఈవో-ఎస్ఎం-II) కుందన్ నాథ్ ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను వెలువరించారు.సయ్యద్ అక్బరుద్దీన్ తో పాటు, యానీ జార్జ్ మాథ్యూ, జనమేజయ కుమార్ సిన్హా కూడా ఆర్బీఐ కేంద్ర బోర్డులో పార్ట్-టైమ్ అనధికారిక డైరెక్టర్లుగా నియమితులయ్యారు.దౌత్యవేత్త అక్బరుద్దీన్ నియామకం పట్ల గీతం నాయకత్వం, కౌటిల్యా అధ్యాపకులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ కొత్త బాధ్యతలపై ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

సయ్యద్ అక్బరుద్దీన్ గురించి:

సయ్యద్ అక్బరుద్దీన్ మూడు దశాబ్దాలకు పైగా వృత్తి జీవితాన్ని గడిపిన, 1985 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు చెందిన ఒక విశిష్ట భారతీయ దౌత్యవేత్త. ఆయన, జనవరి 2016 నుంచి ఏప్రిల్ 2020 వరకు న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధిగా పనిచేశారు. అంతకు ముందు, జనవరి 2012 నుంచి ఏప్రిల్ 2015 వరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. అలాగే, 2006 నుంచి 2011 వరకు వియన్నాలోని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ)లో విదేశీ సంబంధాలు, విధాన సమన్వయ విభాగాధిపతిగా పనిచేశారు.

తన దౌత్య వృత్తి జీవితంలో, అక్బరుద్దీన్ స్వదేశంలోనూ, విదేశాలలోనూ అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. కైరో, రియాద్, జెడ్డా నగరాలలో పనిచేయడం ద్వారా పశ్చిమ ఆసియా వ్యవహారాలపై ఆయన గణనీయమైన నైపుణ్యాన్ని సంపాదించారు. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి కార్యాలయంలో డైరెక్టర్ గా పనిచేయడంతో పాటు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో బాహ్య ప్రచారం, ప్రజా దౌత్య విభాగానికి నాయకత్వం వహించడం వంటి ఉన్నత బాధ్యతలను కూడా ఆయన చేపట్టారు. 2015లో జరిగిన భారత్-ఆఫ్రికా శిఖరాగ్ర సమావేశానికి ఆయన ముఖ్య సమన్వయకర్తగా వ్యవహరించారు.

ఐక్యరాజ్య సమితి (యూఎన్)లో భారతదేశ శాశ్వత ప్రతినిధిగా, అక్బరుద్దీన్ బహుపాక్షిక వేదికలపై భారతదేశ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన సమర్థవంతమైన దౌత్యపరమైన కృషికి విస్తృతంగా గుర్తింపు పొందారు. ఆయన పదవీ కాలంలో ఉగ్రవాద నిరోధం, వాతావరణ మార్పు, సుస్థిర అభివృద్ధి, అంతర్జాతీయ శాంతి భద్రతలు వంటి అంశాలకు గణనీయమైన తోడ్పాటు అందించారు.గీతంలోని కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ డీన్ గా, అక్బరుద్దీన్ ప్రజా విధాన విద్యకు, భారతదేశంలో, వెలుపల భవిష్యత్తు నాయకులను తీర్చిదిద్దడంలో తనవంతు కృషిని కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *