మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం, ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో గ్రామ పెద్ద, మాజీ సర్పంచ్ పట్లోళ్ల రామచంద్రారెడ్డి తన సొంత నిధులతో ఇంద్రేశం రహదారి పునరుద్ధరణ (మరమ్మతు) పనులను చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇంద్రేశం నుండి చిన్న కంజర్ల వరకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారి వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్న దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.అనంతరం మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పటాన్‌చెరు – చిన్న కంజర్ల మార్గంలో ప్రతిరోజు ప్రయాణించే పాల వ్యాపారులు, పాఠశాల విద్యార్థులు, ఉద్యోగులు మరియు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్య తన దృష్టికి రాగానే, ప్రజల రవాణా కష్టాలను ఎంతోకొంత తీర్చాలనే ఉద్దేశంతో తక్షణమే సొంత ఖర్చులతో గుంతలను పూడ్చి రహదారిని పునరుద్ధరించినట్లు వెల్లడించారు.అనంతరం ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రాంత ప్రజల రవాణా కష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి, ఇక్కడ నూతన రోడ్డును మంజూరు చేసి నిర్మించాలని కోరారు.ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వచ్చి రహదారి సమస్యను పరిష్కరించిన మాజీ సర్పంచ్ పట్లోళ్ల రామచంద్రారెడ్డి శ్రద్ధ మరియు నిబద్ధతను ఇంద్రేశం గ్రామ ప్రజలు, వాహనదారులు హృదయపూర్వకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
