మరో రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించిన శివాలి

Telangana

ఇప్పటివరకు 23 గిన్నిస్ రికార్డులతో పాటు 15 అసిస్ట్, 15 యూనిక్ వరల్డ్ రికార్డులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రి శ్రీవాస్తవ (స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, 2016-2020 బ్యాచ్ – సీఎస్ఈ), ఆమె తల్లిదండ్రులు కవితా జోహ్రి శ్రీవాస్తవ, అనిల్ శ్రీవాస్తవలతో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ఓరిగామి ప్రదర్శన (4,700 కుందేళ్ళు, 3,500 తాబేళ్లు) చేసి మరో రెండు సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించారు. ఈ తాజా విజయంతో, శివాలి మొత్తం 23 గిన్నిస్ వరల్డ్ రికార్డులకు చేరుకుని, మనదేశంలో అత్యధిక సంఖ్యలో గిన్నిస్ రికార్డులు కలిగి ఉన్న వ్యక్తిగా నిలిచారు.గతంలో శివాలి 21 గిన్నిస్ రికార్డులు సాధించిన విషయం విదితమే. వాటిలో 1,251 చేతితో తయారు చేసిన కాగితపు బొమ్మలు, 7,011 క్విల్డ్ పువ్వులు, 2,111 పేపర్ క్విల్డ్ బొమ్మలు, 6,132 ఓరిగారి సిట్రస్ పండ్లు, 6,500 ఓరిగామి గబ్బిలాలు, 6,001 ఓరిగామి తిమింగలాలు, 2,100 పెంగ్విన్లు, 6,132 సిట్రస్ పండ్లు, 6,001 తిమింగలాలు, 2,500 పెంగ్విన్లు, 1,993 మాపుల్ ఆకులు, 6,500 గబ్బిలాలు, 5,500 కార్లు, 3,400 డైనోసార్లు, 1,900 కుక్కలు, 3,400 నెమళ్ళు, 3,200 పందులు, 4,400 చొక్కాలు, 2,200 క్విల్డ్ బొమ్మలు, 3,200 సీల్స్, 3,400 రిబ్బన్ టైలు వంటివి ఉన్నాయి.ఇవేగాక, 15 అసిస్ట్ వరల్డ్ రికార్డులు, 15 యూనిక్ వరల్డ్ రికార్డులను కూడా శివాలి సాధించి, తన అసమానమైన సృజనాత్మకత, పట్టుదల, కళ పట్ల మక్కువను ప్రదర్శిస్తోంది.గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్, గణిత శాస్త్ర ఆచార్యుడు డాక్టర్ డి. మల్లికార్జునరెడ్డి, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు శివాలి అసాధారణ విజయాలను ప్రశంసించి, అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *