జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రోవీసీ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సోమవారం (26 జనవరి 2026న) గాంధీ కూడలిలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా, దేశభక్తి స్ఫూర్తితో జరుపుకున్నారు. వందేమాతరం ఇతివృత్తంగా, ఆత్మనిర్బర్ భారత్ చొరవతో అనుసంధానించిన ఈ వేడుకలు, సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్య విలువలు, స్వావలంబన పట్ల జాతి నిబద్ధతను ప్రతిబింబించాయి.ఉదయం 9.00 గంటలకు గీతం హైదరాబాదు ఆదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ నిర్మాణంలో విద్యా సంస్థల కీలక పాత్రను వివరిస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. సాంకేతికత, ఆవిష్కరణలు, నిరంతర శ్రేష్ఠత ద్వారా దేశ నిర్మాణంలో విశ్వవిద్యాలయాలు పోషించే కీలక పాత్రను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.

విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది తాము ఎంచుకున్న రంగాలలో ప్రపంచ స్థాయి ఫలితాలను సాధించడానికి దృష్టి కేంద్రీకరించి, పట్టుదలతో, నిబద్ధతతో ముందుకు సాగాలని ఆయన కోరారు.విశ్వవిద్యాలయ భద్రతా సిబ్బందితో పాటు ఎన్ సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల కవాతు నిర్వహించారు. గీతం విద్యార్థి విభాగాలైన కళాకృతి, అన్వేష క్లబ్బుల సాంస్కృతిక ప్రదర్శనలు, ఉత్సాహభరితమైన బిహు నృత్యం ఆహూతులను అలరించాయి. ఎన్ సీసీ, ఎన్ఎస్ఎస్, భద్రతా సిబ్బందికి వారి అంకితభావ సేవకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలను అందజేశారు.గీతం స్టూడెంట్ లైఫ్ నిర్వహించిన ఈ కార్యక్రమం తేనేటి విందుతో ముగిసింది. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, వారందరినీ ఐక్యంగా, దేశభక్తితో ఈ వేడుకలు ఏకం చేశాయి.

