ఏకాగ్రతతో ఏదైనా సాధించగలం

Telangana

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన స్పిక్ మాకే వ్యవస్థాపకుడు డాక్టర్ కిరణ్ సేథ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఏకాగ్రతతో సాధన చేస్తే ఎటువంటి లక్ష్యాలనైనా సులువుగా సాధించవచ్చునని, మనకు వారసత్వంగా సంక్రమించిన ఉచ్ఛాస, నిశ్ఛాస పద్ధతులను రోజువారీ, అంతరాయం లేకుండా ఆచరించాలని స్పిక్ మాకే వ్యవస్థాపకుడు, ఐఐటీ ఢిల్లీ పూర్వ ఆచార్యుడు డాక్టర్ కిరణ్ సేథ్ గీతం విద్యార్థులకు ఉద్బోధించారు. డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ ఆధ్వర్యంలో ‘వారసత్వ ప్రతిధ్వనులు’పై గురువారం జ్జానోదయ ప్రసంగం చేశారు. ఆధునిక అభ్యాస, పరిశోధనా పద్ధతులను ఏకీకృతం చేస్తూ పూర్వీకులు వారసత్వంగా ఇచ్చిన జ్జాన సంపదను అర్థం చేసుకోవడం, విలువైనదిగా భావించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.పాశ్యాత్య పరిశోధనా పద్ధతుల పట్ల సమతుల్య దృక్పథం ప్రాముఖ్యతను వివరిస్తూ, మన దేశం ప్రపంచానికి అందించే లోతైన వారసత్వాన్ని కూడా గుర్తిస్తూనే, మనం పశ్చిమ దేశాలలోని ఉత్తమైన వాటిని నేర్చుకోవాలని డాక్టర్ కిరణ్ సేథ్ హితవు పలికారు. అనంత కుమార స్వామి జ్జానాన్ని ఆధారంగా చేసుకుని, భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వం పట్ల ప్రస్తుతం ప్రశంస లేకపోవడంపై విచారం వెలిబుచ్చారు. మన వారసత్వం యొక్క ఔచిత్యాన్ని గురించి ఆలోచించడానికి విద్యార్థులు సమయాన్ని కేటాయించాలని, సాంస్కృతిక మూలాల నుంచి విడిపోవడానికి దారితీసే ఆచారాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.

ఒత్తిడి, ఆందోళన పెరుగుతున్న ఈ ప్రపంచంలో, డాక్టర్ సేథ్ ఏకాగ్రత, బుద్ధిని పెంపొందించడానికి ఆచరణాత్మక శ్వాస వ్యాయామాలను (ఉచ్ఛాస, నిశ్ఛాసాలు) సాధన చేయించారు. ఏకాగ్రత సాధనను రోజువారీ ఆచరించే సరళమైన. ప్రభావవంతమైన పద్ధతి అని, నాసికపై దృష్టిని కేంద్రీకరించి యాభై సార్లు గాలిని నెమ్మదిగా పీల్చి, కొద్ది విరామం తరువాత వదలాలని, అలాగే వాయు నాళం ద్వారా నాభి వరకు శ్వాసను పీల్చి, కొద్దిసేపు ఆపి నెమ్మదిగా వదలాలని, చివరగా ఏకగ్రతను రెండు కనుబొమల ఉంచి యాభై సార్లు శ్వాస నెమ్మదిగా, పూర్తి చేతనతో తీసుకుని వదలాలని సూచించారు. ఇలా క్రమం తప్పకుండా చేస్తే, ఏకాగ్రత, స్థిరత్వం పెరిగి అనుకున్నది ఏదైనా సాధించగలని డాక్టర్ కిరణ్ విశ్వాసం వ్యక్తం చేశారు.కళల ద్వారా లోతుగా ప్రభావితమైన ఐన్ స్టీన్, స్వామి వివేకానంద, రామానుజం వంటి విజయవంతమైన వ్యక్తుల ఉదాహరణలను ఉటంకిస్తూ, డాక్టర్ సేథ్ శాస్త్రీయ సంగీతం, అభిజ్జా వికాసం మధ్య సమాంతరాలను కూడా చూపించారు. ఈ శ్వాస అభ్యాసాన్ని దేశంలోని ప్రతి విద్యార్థి వద్దకు ఓ ఉద్యమంలా తీసుకెళ్లాలని సూచించారు. శాస్త్రీయ సంగీతం, నృత్యంలో విరివిగా పాల్గొనాలంటూ విద్యార్థులను ప్రోత్సహించారు.

స్పిక్ మాకే ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం హైదరాబాద్, బంజారాహిల్స్ లోని సప్తపర్ణిలో సాయంత్రం 4 నుంచి 6 వరకు జరిగే కార్యక్రమాలలో పాల్గొనాలని, అలాగే ఐఐటీ హైదరాబాద్ లో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు కూడా పేర్లు నమోదు చేయించుకోవాలని డాక్టర్ కిరణ్ సలహా ఇచ్చారు. తొలుత, గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ వీ.ఆర్. శాస్త్రి తదితరులు డాక్టర్ కిరణ్ సేథ్ ను స్వాగతించి, సత్కరించారు.

ఆకట్టుకున్న తోలుబొమ్మలాట

స్పిక్ మాకే సౌజన్యంతో గురువారం నిర్వహించిన ‘లెదర్ పప్పెట్రీ థియేటర్’ (తోలు బొమ్మలాట) గీతం విద్యార్థులను విశేషంగా ఆకర్షించి, వారిలో నూతనోత్తేజాన్ని నింపింది. ఆంధ్రప్రదేశ్, సత్యసాయి జిల్లా, నిమ్మలకుంటకు చెందిన సింధే హనుమంతరావు నేతృత్వంలోని కళాకారుల బృందం ఈ సాంప్రదాయ ప్రదర్శనను గణేశుని ప్రార్థనతో ఆరంభించి, రామాయణంలోని సుందరకాండను ప్రదర్శించింది. ఈ ఆకర్షణీయమైన ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *