ఓటర్ హక్కు కాపాడాలి – రాజ్యాంగాని రక్షించాలి..
ఎస్ఐఆర్ ప్రక్రియలో అక్రమాలపై కాంగ్రెస్ నిరసన..
కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ధర్నా..
మనవార్తలు ప్రతినిధి ,సంగారెడ్డి :
ఎస్ఐఆర్ ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలు, అవకతవకలపై దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న అభ్యంతరాలను పట్టించుకోకుండా కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బ తీసినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు అన్నారు.
ఏఐసీసీ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సంగారెడ్డి పట్టణ కేంద్రంలో నిర్వహించిన ర్యాలీ, ధర్నాలో ఆయన జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, నారాయణఖేడ్ ఎంఎల్ఏ సంజీవ రెడ్డి, టీ జి ఐ ఐ సి మాజీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గార్లతో కలిసి మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన సమయంలో ప్రజల్లో నెలకొన్న అనుమానాలకు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.

ఎస్ఐఆర్ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్న అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే పరిశీలించాలని, పారదర్శక విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, ఎన్నికల ప్రక్రియపై ప్రజల నమ్మకాన్ని కాపాడే బాధ్యత ఎన్నికల సంఘంపైనే ఉందని పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపుతో జరుగుతున్న నిరసనల్లో భాగంగా సంగారెడ్డిలో ఈ ధర్నా నిర్వహించామని నేతలు తెలిపారు.
ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంజయ్య, టీపీసీసీ తోపాజీ అనంతకిషన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా, మున్సిపల్ చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు, సర్పంచులు, కౌన్సిలర్లు, పట్టణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.
