టిఆర్ఎస్ స్థానిక సంస్థల శాసనమండలి అభ్యర్థి యాదవ్ రెడ్డి విజయం ఖాయం

Districts politics Telangana

బీజేపీ పైన ధ్వజమెత్తిన మంత్రి హరీష్ రావు

మనవార్తలు,  పటాన్చెరు

కేంద్రం నుండి న్యాయబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో మోడీ ప్రభుత్వం కోతలు విధిస్తూ.. ప్రజలకు ధరల వాతలు పెడుతోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో మెదక్ స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రి హరీష్ రావు తో పాటు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, శాసనమండలి అభ్యర్థి యాదవ రెడ్డి లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాలో 1077 స్థానిక సంస్థల ఓట్లు ఉండగా టీఆర్ఎస్ పార్టీకి 777 ఓట్లు ఉన్నాయని, నైతికంగా టిఆర్ఎస్ పార్టీ విజయం ఖాయం అయినప్పటికిని కాంగ్రెస్, బిజెపి పార్టీలు కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పోటీకి నిలబెట్టడం సిగ్గుచేటన్నారు. జాతీయ రాజకీయాల్లో వైరి పక్షాలు గా పేర్కొంటున్న కాంగ్రెస్ బిజెపిలు ఉమ్మడి మెదక్ జిల్లా శాసన మండలి ఎన్నికల్లో ఒకరికొకరు సహకరించుకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. 14, 15వ ఆర్థిక సంఘం నుండి స్థానిక సంస్థలకు నిధులు రావాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు.

 

ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పరిషత్ లకు 250 కోట్లు, మండల్ పరిషత్ లో 250 కోట్లు కేటాయించి, స్థానిక సంస్థలను బలోపేతం చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధుల వేతనాలకు సైతం పెంచడం జరిగిందన్నారు. కోతలు వాతలు తప్ప బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా శాసనమండలి అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ యాదవ రెడ్డి నీ భారీ మెజారిటీతో గెలిపించాలని బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో గత ఎనిమిది సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ పటిష్టతకు అహర్నిశలు కృషి చేయడంతో పాటు, ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ఏజెంటుగా యాదవరెడ్డి పని చేశారని తెలిపారు. పదవుల కోసం ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తే తప్పకుండా గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ డాక్టర్ యాదవ రెడ్డి అన్నారు.

అభివృద్ధి పథంలో పటాన్చెరు..

పటాన్చెరు నియోజకవర్గాన్ని స్థానిక శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. తాను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన వెంటనే పటాన్చెరు నియోజకవర్గంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలని కోరడం ఆయన పని తీరుకు నిదర్శనం అన్నారు. త్వరలోనే పటాన్చెరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు.

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ రెండు విడతల వ్యాక్సిన్ వేయించేందుకు ప్రతి ఒక్కరూ సంపూర్ణ సహకారం అందించాలని మంత్రి హరీష్ రావు కోరారు. ప్రతి వార్డు లో ఒకరోజు సర్వే మరోరోజు వ్యాక్సిన్ వేయించేలా కార్యక్రమాలు రూపొందించాలని ప్రజాప్రతినిధులకు ఆయన సూచించారు.

 

పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో 70 స్థానిక సంస్థల ఓట్లు ఉన్నాయని తెలిపారు. ప్రతిపక్షాల ప్రలోభాలకు ఎవరు గురికావద్దని ఆయన సూచించారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి యాదవ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రసంగించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పోరేటర్లు, వైస్ చైర్మన్ లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, టిఆర్ఎస్ పార్టీ మండల, మున్సిపల్, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *