– గీతం పట్టభద్రులకు సీసీఎంబీ డెరైక్టర్ సూచన
– శాంతా సిన్హా , అంపశయ్య నవీన్‌లకు గౌరవ డాక్టరేట్లు
– 38 మంది పరిశోధక విద్యార్థులు , దాదాపు 1,346 మంది విద్యార్థులకు పట్టాల ప్రదానం
– అత్యుత్తమ ప్రతిభ చాటిన 18 మందికి బంగారు పతకాలు
మనవార్తలు ,పటాన్ చెరు:
పటాన్ చెరు సమీపంలో నెలకొని ఉన్న గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శనివారం 13 వ స్నాతకోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు . గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ , కులపతి డాక్టర్ వీరేందర్ సింగ్ చౌహాన్లు పాల్గొన్న ఈ స్నాతకోత్సవానికి సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ వినయ్ కె.నందికూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు . బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం పాటుపడిన రామన్ మెగసెసే అవార్డు గ్రహీత ప్రొఫెసర్ శాంతా సిన్హాతో పాటు ప్రఖ్యాత తెలుగు నవలా రచయిత అంపశయ్య నవీన్‌లకు డాక్టర్ ఆఫ్ లెటర్స్న ప్రదానం చేశారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం నుంచి 2021-22 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ , మేనేజ్మెంట్ , సెన్స్ , ఫార్మశీ , హ్యుమానిటీస్ కోర్సులు పూర్తిచేసిన దాదాపు 1,346 మంది పట్టభద్రులకు డిగ్రీలను , 18 మంది ప్రతిభావంతులకు బంగారు పతకాలను అందజేశారు .
38 మంది రీసెర్చి స్కాలర్లకు పీహెచీ డిగ్రీలను ప్రదానం చేశారు . ఎంఏలో ఆరుగురు , ఎంబీఏ -65 , ఎస్సీ -55 , ఎంటెక్ -26 , బీఏ -39 , బీబీఏ -184 , బీకాం -36 , బీఫార్మశీ -30 , బీఎస్సీ -118 , బీటెక్ -787 మంది పట్టభద్రులయ్యారు . ఈసీఈ విభాగంతో పాటు బీటెక్ టాపర్‌గా నిలిచిన నక్కా నవ్యశ్రీ గీతం అధ్యక్షుడి పేరిట నెలకొల్పిన రెండు బంగారు పతకాలను అందుకోగా , పీజీ విద్యార్థిని సి . రేఖా యాదవ్ , యూజీ విద్యార్థిని ఆముక్త చౌదరి గద్దె ‘ బెస్ట్ ఆల్‌రౌండర్ ‘ బంగారు పతకాలను పొందారు . పచ్చటి ప్రకృతి మధ్య సుందర ప్రాంగణంలో నెలకొని ఉన్న గీతం ప్రాంగణానికి వెళ్లే దారులన్నీ బ్యానర్లతో అలంకరించారు . అంతర్జాతీయ సదస్సులను తలపించేలా దారుల వెంట బారులు తీరిన రంగు రంగుల జెండాలు మరింత శోభను ఇనుమడింపజేశాయి . అందంగా తీర్చిదిద్దిన రంగవల్లులు , పూల అలంకరణలు వీనుల విందు చేశాయి .
పట్టాలను అందుకోవడానికి వచ్చిన విద్యార్థులు , వారి తల్లిదండ్రులతో ఆవరణలో సందడి నెలకొంది . తనంత ఎదిగి ప్రయోజకులవుతున్న పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు మురిసిపోగా , పట్టాలు అందుకున్న విద్యార్థులు హిప్ హిప్ హుర్రే నినాదాలతో తమ హర్షధ్వానాలను వ్యక్తపరిచారు . తల్లిదండ్రుల ఆత్మీయ ఆలింగనాలు , మిత్రులను హృదయానికి హత్తుకుపోవడం వంటి దృశ్యాలు వాతావరణాన్ని ఆహ్లాదకరం చేశాయి . పట్టభద్రులంతా తెల్లని దుస్తులు , ఎర్రని కండువాలతో వచ్చి భారతీయను వ్యక్తపరిచారు . దీనితో ప్రాంగణమంతా దవళవర్ణ శోభితంగా మారింది . బంగారు పతక విజేతలు , పట్టభద్రులు పలువురు గీతమ్ తమకున్న అనుబంధం , అక్కడ ఎదిగిన తీరు , విద్యనభ్యసించేటప్పటి పలు మథుర స్మృతులను నెమరువేసుకున్నారు . మొత్తంగా పండుగ వాతావరణంలో గీతం 13 వ స్నాతకోత్సవం విజయవంతంగా ముగిసింది .
ఈ 13 వ స్నాతకోత్సవంలో గీతం కులపతి డాక్టర్ వీరేందర్ సింగ్ చౌహాన్ , ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్దవటం , గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు , గీతం వైద్య కళాశాల ప్రోవీసీ డాక్టర్ గీతాంజలి బత్మనాబానే , గీతం బెంగళూరు ప్రొవీసీ ప్రొఫెసర్ ఎం.ఎస్.మోహన్‌కుమార్ , రిజిస్ట్రార్ డాక్టర్ డి.గుణశేఖర్ , డీన్లు ప్రొఫెసర్ అమిత్ భద్రా , సయ్యద్ అక్బరుద్దీన్ , ప్రొఫెసర్ పి.రామారావు , ప్రొఫెసర్ సి.విజయశేఖర్ , గీతం కార్యదర్శి ఎం.భరద్వాజ , రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.