చిట్కుల్ గ్రామం పల్లె ప్రగతి కి ప్రతిబింబంగా కనిపిస్తుంది…
– గ్రామంలో పనితీరు ప్రగతికి నిదర్శనం
– జిల్లా కలెక్టర్ హనుమంతరావు
పటాన్ చెరు:
చిట్కుల్ గ్రామం పల్లె ప్రగతి ప్రతిబింబంగా నిలుస్తోందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కితాబునిచ్చారు. గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజు పనితీరు అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు. పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలో శుక్రవారం జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తో కలిసి గ్రామంలో బృహుత్ పల్లె ప్రకృతి వనానికి భూమి పూజ చేసి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామం అన్ని విధాల బాగుందని, పాలకవర్గం పనితీరు సంతృప్తినిచ్చిందన్నారు. మహిళా సంఘాలు బాగా పనిచేస్తున్నాయని, తడి పొడి చెత్తను వేరు చేసి, తడి చెత్తతో ఎరువు తయారు చేస్తున్నారని, ఈ ప్రక్రియ నిరంతరం వంద శాతం జరిగేలా గ్రామ ప్రజలు సహకరించాలనీ కోరారు.
నగరాన్ని తలపించేలా గ్రామంలో అభివృద్ధి కనిపిస్తుందన్నారు. రానున్న కాలంలో చిట్కుల్ గ్రామాన్ని పెద్ద ఎత్తున అధికారులు సందర్శించే అవకాశం ఉందన్నారు. ఎక్కడ చూసినా మొక్కలతో పచ్చదనం కనిపిస్తుందన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని 13 ఎకరాలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని పెద్ద చెట్లతో ఒక చిట్టడవిలా రూపొందించాలని కలెక్టర్ సూచించారు. ఇంటింటికి ఇచ్చిన 6 మొక్కలను మంచిగా పెంచాలనీ మహిళలకు సూచించారు. చిట్కుల్ ను చూసి చుట్టు పక్కల గ్రామాలు మారుతున్నాయన్నారు. పల్లె ప్రగతి నిరంతర ప్రక్రియ అని, ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
వైకుంఠధామం చుట్టు బయో ఫెన్సింగ్ చేయాలని సర్పంచ్ కు సూచించారు. కొత్త కాలనీలలో అండర్ డ్రైనేజీ పూర్తి చేసుకోవాలన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం తో గ్రామాల్లో చాలా మార్పు కనిపిస్తుందని, పల్లె ప్రగతికి ముందు తర్వాత పోల్చి చూస్తే వ్యత్యాసం ఎంతో కనపడుతుందన్నారు.
కరొనా సమయంలోనూ సర్పంచ్, పాలకవర్గం గ్రామ ప్రజలకు అండగా నిలిచి అప్రమత్తంగా వ్యవహరించారని, థర్డ్ వేవ్ రాకుండా ముందస్తు జాగ్రత్త వహించాలన్నారు. టీకా తీసుకోవడం, మాస్క్ ధరించడం, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం లాంటివి కొనసాగించాలని సూచించారు.
10 లక్షల బీమా చెక్కును కలెక్టర్ కు అందజేత…
సర్పంచ్ నీలం మధు తల్లిదండ్రులు ఇటీవలే చనిపోవడంతో, వారి పేరిట వచ్చిన 10 లక్షల భీమా డబ్బులను సర్పంచ్ గ్రామాభివృద్ధికి(చెక్కు) విరాళంగా అందజేశారు.
గ్రామాభివృద్ధికి పాటుపడుతూ, గ్రామాన్ని అభివృద్దిలోముందంజలో నిలిపిన సర్పంచ్ మధును, ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ కవితను కలెక్టర్ అభినందించి శాలువా కప్పి సన్మానించారు.
అంతకుముందు గ్రామంలోని నర్సరీ, డంపింగ్ యార్డ్, పారిశుద్ధ్య నిర్వహణను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజర్షి షా, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ శ్రీనివాస్ రావు, డిఎఫ్ఓ వెంకటేశ్వర్లు, డిపిఓ సురేష్ మోహన్, ఎంపీడీవో బన్సీలాల్, తహసిల్దార్ మహిపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి డి, ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, ఎంపిటిసి మాధవి నరేందర్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.