మనవార్తలు ,పటాన్‌చెరు:
నానో టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న శాస్త్రమని , ఇది వేగవంతమైన , బలమైన భవిష్యత్తు అభివృద్ధిని కలిగి ఉంటుందని , రాబోయే దశాబ్దాల్లో ఆర్థిక వృద్ధికి , ఉద్యోగాల కల్పనకు ఇది గణనీయంగా దోహదపడగలదని ‘ బ్రూనే సాంకేతిక విశ్వవిద్యాలయంలోని రసాయన , పెట్రోలియం ఇంజనీరింగ్ విభాగం ఆచార్యుడు ప్రొఫెసర్ శివకుమార్ మాణికం అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీ ఆధ్వర్యంలో ‘ నానో ఫార్ములేషన్ , దాని వినియోగంలో ఆధునిక పోకడలు ‘ అనే అంశంపై సోమవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు . ప్రపంచ నానో టెక్నాలజీ మార్కెట్ పరిమాణం 2020 లో 1.76 బిలియన్ డాలర్లుగా ఉందని , 2030 నాటికి అది 33.63 బిలియన్లకు చేరుకుంటుందని ఓ అంచనాగా ఆయన చెప్పారు .
నానో సెన్స్డ్ , నానా టెక్నాలజీలో నానో పార్టికల్స్ , పరికరాల అధ్యయనం ఉంటుందని , ఇది బయో – మెడికల్ , మెకానిక్స్ , మెటీరియల్ సెన్స్ , రసాయనాల వంటి అన్ని శాస్త్ర రంగాలలో వినియోగిస్తారని ఆయన వివరించారు . నానో టెక్నాలజీ గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని , కమ్యూనికేషన్ , మెడిసిన్ , రవాణా , వ్యవసాయం , శక్తి , పదార్థాలు , తయారీ , వినియోగదారుల ఉత్పత్తులు , గృహాలతో సహా వివిధ పారిశ్రామిక రంగాలలో విప్లవాత్మక , ప్రయోజనకరమైన సాంకేతికతగా పనిచేస్తుందని ప్రొఫెసర్ శివకుమార్ తెలిపారు . ఈ సందర్భంగా విద్యార్థులు లేవనెత్తిన పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు . తొలుత , ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ అతిథిని విద్యార్థులకు పరిచయం చేసి సత్కరించారు . ఈ ఆతిథ్య ఉపన్యాస కార్యక్రమంలో సెన్స్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎ.ఎన్.దత్తాత్రి , పలువురు ఫార్మశీ – సెన్స్డ్ అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు .