మనవార్తలు ,పటాన్ చెరు:
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో పటాన్చెరు నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన ఉచిత పోలీసు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని బంగారు భవితకు బాటలు వేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సౌజన్యంతో పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఉచిత పోలీసు శిక్షణ తరగతులు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ లక్షల రూపాయలు వెచ్చించి ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందని, నిష్ణాతులైన అధ్యాపకులచే శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. శిక్షణా తరగతులు జరిగే 90 రోజుల పాటు ఏకాగ్రతతో శిక్షణ పొంది, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఉచిత భోజనం, స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని తెలిపారు. శిక్షణ తరగతుల్లో అందించే కోచింగ్ ద్వారా పోలీసు శాఖతో పాటు కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సైతం ఉపయోగపడుతుందని తెలిపారు. నిరంతరం తాను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో డిఎస్పీ భీమ్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, సిఐలు వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్, గోపి, సిబ్బంది పాల్గొన్నారు.