గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్ (ఐసీ)తో కలిసి గీతం వార్షిక హ్యాకథాన్ జీ-హ్యాక్-2023 పోటీలను శుక్రవారం విజయవంతంగా నిర్వహించింది. గురువారం ఉదయం ప్రారంభమైన ఈ 24 గంటల మారథాన్ పోటీలో హెదరాబాద్ నలుమూలల ఉన్న వివిధ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.వందలాది మంది ఉత్సుకత గల విద్యార్థులను ఒకచోట చేర్చిన ఈ కార్యక్రమానికి జంబోరీ, రెడ్ బుల్, సందీప్ టెక్నాలజీల సహకారాన్ని అందించాయి. ఇందులో పాల్గొన్న ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా అపారమైన ప్రతిభను, తమ వినూత్న ఆలోచనలను ఈ సందర్భంగా ఆవిష్కరించి, న్యాయ నిర్ణేతల మనస్సులను చూరగొన్నారు.సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, ఎంజీఐటీ, పల్లివి ఇంజనీరింగ్ కాలేజి, కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీ, ఐఐటీ హెదరాబాద్ సహా మొత్తం 21 బృందాలు ఈ హ్యాకథాన్‌లో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. వినియోగదారుల దృక్కోణం, కార్యాచరణ, క్లిష్టత స్థాయి వంటి ప్రమాణాల ఆధారంగా న్యాయమూర్తుల ఆయా ప్రాజెక్టులను మూల్యాంకనం చేశారు.జీ-హ్యాక్ అనేది విద్యార్థులలో ఉత్సుకతను పెంపొందించి, వినూత్న ఆవిష్కరణలను ఆవిష్కరింపజేసే వేదికగా బీటెక్ తొలి ఏడాది సమన్వయకర్త ప్రొఫెసర్ పి.త్రినాథరావు పేర్కొన్నారు. ఈ పోటీలలో పాల్గొన్నవారు ప్రదర్శించిన అద్భుత ప్రతిభ, అంకితభావాన్ని చూసి తాము గర్విస్తున్నట్టు ఆయన చెప్పారు.
విజేతల వివరాలు:
రోహన్, మహమ్మద్ సిరాజుద్దీన్, సాయిరాజ్, త్రయంబకేశ్వర ప్రసాద్ తో కూడిన ఎంఎల్ఆర్టీ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన జీరోడే బృందం తొలి స్థానంలో నిలిచి, పది వేల రూపాయల నగదు పురస్కారంతో పాటు మూడు వేల రూపాయల విలువైన వోచర్‌ను గెలుచుకుంది.బి.తరుణ్, కె.నిష్మాతో కూడిన గీతం, జీఆర్ ఐఈటీ టర్నిపర్స్ బృందం రెండో స్థానంలో నిలిచి, ఆరు వేల నగదు పురస్కారంతో పాటు మూడు వేల రూపాయల నోచర్ను గెలుచుకుంది.కె.వెంకట శ్రీరామ్, వర్షిత పటేల్, సాథ్విక్ వర్షన్, సాయి గణేష్, ఎ. పూజిత, జి. పూజితలతో కూడిన ఎంజీఐటీ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన తరంగిణి హెట్రో టెక్ బృందం మూడో స్థానంలో నిలిచి నాలుగు వేల రూపాయల నగదు పురస్కారంతో పాటు మూడు వేల రూపాయల వోచర్‌ను గెలుచుకుంది.దీనికి అదనంగా, అభిషేక్ శర్మ. కె.మనీషా, ఎం.నవీన్, జి. అభిషేక్, జె. స్నేహలతో కూడిన ఎంజీఐటీ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఆక్వా ఇన్నోవేటర్స్ బృందం మూడు వేల రూపాయల వోచర్‌ను గెలుచుకుంది.ఈ హ్యాకథాన్ ను విజయవంతం చేయడంతో సహకరించిన వివిధ కళాశాలల విద్యార్థులు, స్పాన్సర్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు.