లాంఛనంగా ప్రారంభించిన పరిశ్రమ నిపుణులు నిరుపమ ఎస్.దేశికన్, మోహన్ కుమార్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
విద్యా నైపుణ్యం, పరిశ్రమ-ఆధారిత అభ్యాసం వైపు గణనీయమైన పురోగతిలో భాగంగా, గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం రెండు అత్యాధునిక ప్రయోగశాలలను (ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్, ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్ మెంట్ అండ్ సెన్సరీ ఎవాల్యుయేషన్ ల్యాబ్) నెలకొల్పింది. వాటిని ప్రముఖ పరిశ్రమ నిపుణులు- ప్రియా ఫుడ్స్ పరిశోధన-అభివృద్ధి విభాగం (ఎన్ పీడీ) డిప్యూటీ జనరల్ మేనేజర్ నిరుపమ ఎస్.దేశికన్, దొడ్లా డైరీలో నాణ్యతా విభాగాధిపతి మోహన్ కుమార్ రేటూరి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ అత్యాధునిక సౌకర్యాలు యూజీ, పీజీ విద్యార్థులను ఆహార పరిశ్రమలో విజయానికి కీలకమైన ఆచరణాత్మక నైపుణ్యాలతో సన్నద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. తద్వారా వారు సమగ్ర ఉత్పత్తి పరీక్ష, ఆచరణాత్మక ప్రయోగాలు, వినూత్న పరిశోధనలను నిర్వహించగలుగుతారు. అటువంటి వాటిని పరిశ్రమ నిపుణులతో ఆవిష్కరించడం ద్వారా, బలమైన పరిశ్రమ-విద్యా సహకారాలను పెంపొందించడానికి, ఆహార శాస్త్ర విద్యను మెరుగుపరచడంలో గీతం నిబద్ధతను చాటి చెబుతోంది.
ఈ వినూత్న ప్రయోగశాలలు ఆవిష్కరణ, పరిశోధన, నైపుణ్య అభివృద్ధికి కేంద్రాలుగా పనిచేయడంతో పాటు విద్యార్థులకు ఆహార విశ్లేషణ, ఉత్పతి అభివృద్ధి, మూల్యాంకనంలో ఆచరణాత్మక శిక్షణ అందించనున్నాయి.ఈ ప్రారంభోత్సవంలో భాగంగా, గౌరవ అతిథులు విద్యార్థులను ఉత్సాహపరిచేలా ప్రసంగించారు. ఆహార నాణ్యత, భద్రత, ఉత్పత్తి అభివృద్ధితో సహా కీలకమైన పరిశ్రమ అంశాలపై లోతైన అవగాహనను కల్పించారు. ఆహార శాస్త్రం, సాంకేతిక రంగ ధోరణులు, పరిశ్రమ సవాళ్లు, అవకాశాలపై విద్యార్థులకు వారు మార్గనిర్ధేశనం చేయడమే గాక, అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలపై విలువైన దృక్పథాలను వివరించారు.ఫుడ్ సైన్స్ కోర్సు సమన్వయకర్త డాక్టర్ జి.నిహారిక ఈ సందర్భంగా మాట్లాడుతూ, పరిశోధనను ప్రోత్సహించడానికి, కొత్త ఆహార ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి, వ్యవస్థాపక అవకాశాలను అన్వేషించడానికి, విద్యా, వృత్తిపరమైన వృద్ధిని మరింత మెరుగుపరచడానికి ఈ అత్యాధునిక ల్యాబ్ లను పూర్తిగా వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు.
ఆహార రంగంలో రాణించాలని అభిలషించే వారికి గీతం మంచి వేదికన్నారు. ఆహార పరిశ్రమలో అభివృద్ధి చెందుతున్న కెరీర్ కు అవసరమైన జ్జానం, నైపుణ్యాలతో భవిష్యత్ నిపుణులను సన్నద్ధం చేయాలనే గీతం నిబద్ధత, చొరవకు ఈ అత్యాధునిక ల్యాబ్ లే నిదర్శనమని డాక్టర్ నిహారిక పేర్కొన్నారు.తొలుత, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, అతిథులను స్వాగతించి, ఆహార రంగానికి వారి అమూల్యమైన సహకారాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఫుడ్ సైన్స్, టెక్నాలజీ విద్యార్థులు వినూత్న ఆహార ఉత్పత్తులను ప్రదర్శించడమే గాక, అధునాతన ఆహార కల్తీ గుర్తింపు పద్ధతులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని, విజయవంతం చేశారు.