-వైభవంగా గణేష్ గడ్డ హుండీ లెక్కింపు
-102 రోజుల్లో రూ. 36.28 లక్షల ఆదాయం
-పారదర్శకంగా నిర్వహించిన దేవాదాయ శాఖ అధికారులు
-ఆలయాభివృద్ధి, అన్నదానానికి నిధుల వినియోగం: ఈవో లావణ్య
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం గ్రామంలో వెలిసిన శ్రీ సిద్ధి వినాయక దేవాలయం (గణేష్ గడ్డ) హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని సోమవారం ఆలయ ఈవో లావణ్య, సంగారెడ్డి ఇన్స్పెక్టర్ రంగారావుల పర్యవేక్షణలో నిర్వహించారు .శ్రీ గణేష్ గడ్డ సిద్ది గణపతి దేవస్థానంలో వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు నవరాత్రుల సందర్భంగా 90 రోజులకు గాను భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా మొత్తం 36 లక్షల 28 వేల 312 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో లావణ్య తెలిపారు.అనంతరం ఆలయ ఈవో లావణ్య మాట్లాడుతూ రుద్రారంలో స్వయంభువుగా వెలిసిన శ్రీ సిద్ధి గణపతి భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్నారని ,ఇటీవల జరిగిన వినాయక చవితి బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా విచ్చేసిన భక్తులు స్వామివారికి కానుకలు, అన్నదాన విరాళాలు సమర్పించుకున్నారని చెప్పారు. వచ్చిన ఈ ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి పనులతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలకు ఖర్చు చేయనున్నట్లు ఈవో లావణ్య తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్, అర్చకులు సంతోష్ పంతులు, జగదీష్ పంతులు, అయ్యప్ప పంతులు, ఆలయ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు.
