శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

politics Telangana

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం

సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన శ్రమశక్తి నీతి-2025 సెమినార్ కి చుక్క రాములు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాములు మాట్లాడుతూ ఈ లేబర్ పాలసీతో కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర జరుగుతున్నదని, సమిష్టి బేరసారాల హక్కును హరించి, ఐఎల్ ఓ ను బైపాస్ చేసి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఈ పాలసీ తెచ్చారని ఆరోపించారు. దేశంలో కార్మికశక్తిని ఐక్యం కానీయకుండా కార్పొరేట్ల రాజ్యంలా మార్చడానికి ఈ శ్రమశక్తి నీతి 2025 ఉపయోగపడుతుందని, మన రాజ్యాంగంలో కార్మికులకు కల్పించిన సామాజిక న్యాయం, సమానత్వం, శ్రమకు గౌరవం వంటి విలువలకు పూర్తి విరుద్ధమని, దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి మూల కారణమైన కార్మికవర్గ హక్కులపై యూనియన్ల తో చర్చించకుండా ఏకపక్షంగా అమలుచేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ పాలసీని కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దుచేయాలని, ఈ అంశంపై కార్మికవర్గమంతా ఐక్యమై పోరాటాలకు సిద్ధంకావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో శాండ్విక్ యూనియన్ నాయకులు పి. పాండురంగా రెడ్డి, ఎమ్. మనోహర్, ఎ. వీరారావు, ఎమ్. సత్తిబాబు, వివిధ కమిటీల సభ్యులు, మాజీ ఆఫీస్ బేరర్స్, మాజీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *