పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి ::
నాల్గవ తరం రోబోలు మానవ మానసిక శక్తితో సమానంగా రూపొందవచ్చని, అవి మేధోపరంగా బలీయులుగా మారే అవకాశం కూడా లేకపోలేదని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్వోటీ) అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని గీతమ్లో శుక్రవారం నిర్వహించిన ‘రోబోటిక్స్ వర్క్షాప్’, రోబోటిక్స్ అటానమస్ వెహికల్ క్లబ్ (ఆర్పీ)లను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. మెకానికల్ ఇంజనీరింగ్, అడ్మిషన్ల విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ నలుమూల ఉన్న 15 పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన దాదాపు 180 మంది విద్యార్థులు పాల్గొన్నారు.భవిష్యత్తు విద్య నైపుణ్యాల ఆధారితంగా ఉంటుందని, అంతర్ విభాగ అవగాహనకు ప్రాముఖ్యత పెరుగుతుందని, పలు అంశాలపై నిపుణత సాధించి వారే నిలబడగలిగేలా ఉంటుందని ప్రొఫెసర్ సీతారామయ్య చెప్పారు. తయారీ రంగం, ప్యాకేజింగ్, ఆయుధాలు, భద్రత, వినియోగదారు-పారిశ్రామిక వస్తువుల భారీ ఉత్పత్తి మొదలైన వాటిలో రోబోలను విస్తృతంగా వినియోగిస్తున్నారని ఆయన వివరించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు రాణించాలని ప్రొఫెసర్ సీతారామయ్య సూచించారు.మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి. శ్రీనివాస్ ఆ విభాగ ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజెప్పడంతో పాటు, అక్కడి మానవ-సాంకేతిక వనరులను విద్యార్థులు గరిష్ఠంగా సద్వినియోగం చేసుకోవాలని హితబోధ చేశారు.
భవిష్యత్తు అంతా నెపుణ్యం ఆధారితంగా ఉంటుందని ప్రొఫెసర్ పి.ఈశ్వర్ చెప్పారు. కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ ఏ. కిరణ్ కుమార్ వర్క్షాప్ లక్ష్యాలను వివరించారు. విద్యార్థి సమన్వయకర్తల వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.రోబోటిక్ కదలిక, దానిలోని వివిధ భాగాల ద్వారా మెకానిక్స్, ముఖ్యంగా రోబోట్ ఆర్మ్ గురించి వివిధ పాలిటెక్నిక్ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు తెలుసుకున్నారు. అలాగే సీఎన్సీ లేత్, సీఎన్సీ మిల్లింగ్, త్రీడీ ప్రింటింగ్ వంటి పలు అంశాలపై వారు ప్రాథమిక అవగాహన ఏర్పరచుకున్నారు.