_రామేశ్వరం బండ గ్రామంలో నూతన పాఠశాల భవనం, సిసి రోడ్లు ప్రారంభోత్సవం
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలకు ఆధునిక వసతులతో కూడిన భవనాలు నిర్మిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు మండలం రామేశ్వరం బండ గ్రామంలో ఒక కోటి 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం, 60 లక్షల రూపాయలతో వీకర్ సెక్షన్ కాలనీలో నిర్మించిన సిసి రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో మన ఊరు మనబడి ద్వారా ప్రభుత్వ విద్య వ్యవస్థలో సమూల మార్పులు తీసుకుని రావడం జరిగిందని తెలిపారు. సరిపడా సిబ్బంది, ఆధునిక వసతులు కల్పిస్తున్న నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలి కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు అంతిరెడ్డి, దశరథరెడ్డి, వెంకట్రెడ్డి, గ్రామ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.