ప్రొఫెసర్ జయశంకర్ సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే జిఎంఆర్

politics Telangana

పటాన్‌చెరులో ఘనంగా జయంతి వేడుకలు – విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం పటాన్‌చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నంతా అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. తొలి, మలి విడత ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో ఆయన పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతపరమైన బలాన్ని అందిస్తూ, ప్రజల్లో చైతన్యం నింపిన మహోన్నత వ్యక్తిగా జయశంకర్ సార్ చిరస్మరణీయులని పేర్కొన్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్న ఆకాంక్షతో ఆయన చేసిన కృషి, త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుల్లో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రగణ్యులని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని పటాన్‌చెరు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే జిఎంఆర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, సీనియర్ నాయకులు యాదగిరి యాదవ్, విజయ్ కుమార్, నర్రా బిక్షపతి, శ్రీధర్ చారి, అశోక్, వెంకటేష్, షకీల్, ధనరాజ్ గౌడ్, రామ్మోహన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *