మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
అలంకార శాస్త్రం పై పరిమితంగా పరిశోధనలు జరుగుతున్న ఈ కాలంలో పోతన రాసిన మహా భాగవతంలో అలంకార శిల్పం గురించి పరిశోధన చేయడం ఎంతో విశేషమైన కృషిగా ఆచార్య పిల్లలమర్రి రాములు వ్యాఖ్యానించారు. పటాన్ చెరువు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడుగా పనిచేస్తున్న డాక్టర్ గొట్టే శ్రీనివాసరావు తన పరిశోధన గ్రంథం ’పోతన భాగవతం – అలంకారశిల్పం’ ను గురువారం తెలుగు శాఖ, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఆచార్య పిల్లలుమర్రి రాములు ఆవిష్కరించి మాట్లాడారు. తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహిస్తూ మహాకావ్యమైన ఆంధ్ర మహాభాగవతం పై పరిశోధన చేయడమే ఒక విశేషం అయితే దానిలోని అలంకారాలపై సమగ్రంగా అధ్యయనం చేయడం అత్యంత ప్రశంసనీయమని ఆయన అన్నారు. ఆచార్య పిల్లలమర్రి రాములు గారి దగ్గర ఇప్పటివరకు సుమారు 30 పీహెచ్డీలు 40 ఎంఫిల్ పరిశోధనలు జరిగినప్పటికీ ఇదే తొలి పీహెచ్డీ కావడం ఒక విశేషమని ఆచార్య దార్ల పేర్కొన్నారు. గ్రంథరచయిత డాక్టర్ గొట్టే శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను చదువుకొని పరిశోధన చేసిన తెలుగు శాఖలోనే తన పర్యవేక్షకుడి చేతుల మీదగా తన గ్రంథం ఆవిష్కరణ కావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ఎం. గోనానాయక్ , ఆచార్య పమ్మి పవన్ కుమార్ ,ఆచార్య డి. విజయలక్ష్మి, ఆచార్య పి.వారిజారాణి, ఆచార్య త్రివేణి వంగరి, డా.బాణాల భుజంగరెడ్డి, డా.డి.విజయకుమారి, డా.లచ్చయ్య, డా.భగ్గునాయక్ తదితరులు పాల్గొన్నారు.