గీతమ్ లో గణాంక పితామహుడు ప్రశాంత చంద్ర మహల్నోబిస్ సేవల స్మరణ
పటాన్ చెరు:
గణాంక పితామహుడు ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహల్నోటెస్ జన్మదినాన్ని స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా ప్రతియేటా జూన్ 29 నిర్వహించే జాతీయ గణాంక దినోత్సవాన్ని మంగళవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశంలో గణాంక వ్యవస్థ అభివృద్ధి అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఉస్మానియా విశ్వవిద్యాలయ గణాంక శాస్త్ర విశ్రాంత ఆచార్యుడు డాక్టర్ ఎం.కృష్ణారెడ్డి ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ప్రొఫెసర్ మహల్నోబిస్ ప్రస్థానం, గణాంక శాస్త్రానికి ఆయన చేసిన సేవలు, భారతదేశ గణాంక వ్యవస్థ అభివృద్ధిలో ఆయన పాత్ర వంటి అంశాలను అతిథి వివరించారు. 1947 లో ఢిల్లీలో జరిగిన మత ఘర్షణల వల్ల శరణార్థులుగా వచ్చి ఎర్రకోటలో తలదాచుకున్న వారి సంఖ్యను గుర్తించడానికి ఆయన గణాంకాలు ఎంతో తోడ్పడ్డాయని, తద్వారా గణాంక శాస్త్రాభివృద్ధికి భారత ప్రభుత్వ ఇతోధిక మద్దతు లభించిందన్నారు.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇండియన్ స్టాటస్టికల్ సొసైటీ వ్యవస్థాపనలో మహల్నోబిస్ పాత్ర, భూరి విరాళం వంటివి డాక్టర్ రెడ్డి స్మరించుకున్నారు. తొలుత, గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు, గణితశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ కె.మారుతీప్రసాద్, ప్రొఫెసర్ బీఎం నాయుడు తదితరులు గణాంక శాస్త్ర ప్రాముఖ్యత మ, ప్రయోజనాలు, వాతావరణ అంచనా, ఆరోగ్య సంబంధిత సమస్యలను కనుగొనడం, ద్రవ్యోల్బణం, డేటా సైన్స్ లో గణాంకాల పాత్రలను వివరించారు. గణాంక విభాగం సమన్వయకర్త డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి, విద్యార్థి సమన్వయకర్తలు శ్రీపాల్ సింగ్, సూర్యవంశీ, పలువురు అధ్యాపుకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.