పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘జాతీయ గణిత దినోత్సవాన్ని’ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల కోసం క్విజ్, గణిత నమూనా ప్రదర్శన, గణిత క్విజ్ పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులను, ప్రశంసాపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం గణిత శాస్త్ర విభాగం పూర్వ ప్రొఫెసర్ కె.సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతీయ గణిత శాస్త్రవేత్త 136వ జయంతిని పురస్కరించుకుని శ్రీనివాస రామానుజన్ జీవితం, ఆయన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పేద కుటుంబంలో పుట్టినా తనకు ఇష్టమెనై లెక్కల్లో పట్టుసాధించి, ఆంగ్లేయుల ప్రశంసలు పొందడం వరకు ఆయన వివరించారు. పది, పన్నెండో తరగతులలో అనుత్తీర్ణుడైనా,లెక్కలపై ఉన్న మక్కువ ద్వారా బీఏ పట్టానే కాకుండా రాయల్ అకాడమీ ఫెలోషిప్ సాధించినట్టు చెప్పారు. ప్రొబబిలిస్టిక్ నంబర్ థియరీ, కొన్ని అంకగణిత విధులసి ఆయన రాసిన సంచలనాత్మక పత్రాలు, రామానుజన్ విజయాలను వివరించారు.లెక్కల్లో కొన్ని సరదా వాస్తవాల గురించి గీతం సీఎస్ఈ డీన్ ప్రొఫెసర్ సి.విజయశేఖర్, గణిత శాస్త్ర రంగానికి రామానుజన్ సేవల గురించి గీతం సైన్స్ డీన్ ప్రొఫెసర్ కొల్లూరు శ్రీకృష్ణ, స్మరించుకున్నారు. కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ కృష్ణ, వందన సమర్పణతో ముగిసిన ఈ కార్యక్రమంలో గణితశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ మోతహర్ రెజా, సీనియర్ ప్రొఫెసర్ బీ.ఎం. నాయుడు, డాక్టర్ డి. మల్లికార్జునరెడ్డి, ఇతర ఆధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పాఠ్యాంశాల మార్పుపై కార్యశాల
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం ‘మారుతున్న ప్రపంచానికి రూపాంతరం’ పేరిట పాఠ్యంశాల మార్పుపే ఒకరోజు కార్యశాల నిర్వహించింది. అభివృద్ధి చెందిన వాతావరణానికి అనుగుణంగా సిలబస్ లో మార్పులుచేర్పులు చేపట్టే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. గీతం కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వి.రామశాస్త్రి, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవిల ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్క్ షాప్ లో ప్రఖ్యాత విద్యా సంస్థల నిపుణులు పాల్గొన్నారు. ఐఐటీ హైదరాబాద్ కు చెందిన ప్రొఫెసర్ వి.శివరామకృష్ణ, ప్రొఫెసర్ వాస్కర్ సర్కార్, ఐఈఈ మాజీ చైర్మన్ డాక్టర్ బ్రహ్మారెడ్డి, ఎన్సిటీ సూరత్కల్ కు చెందిన ప్రొఫెసర్ సి.శ్రీహరి, వరంగల్ లోని ఎన్ఐఐటీకి చెందిన ప్రొఫెసర్ ఎన్.విశ్వనాథం, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఎ. నిర్మలాదేవి, ప్రొఫెసర్ జి. యేసురత్నం రిసోర్స్ పర్సన్లుగా పాల్గొని తమ విలువైన సలహాలు, సూచనలను చేశారు. సరిశ్రమలో మారుతున్న డిమాండ్ కు అనుగుణంగా పాఠ్యాంశాలను మార్పును వారు సూచించారు.గీతం ఈఈసీఈ విభాగానికి చెందిన అధ్యాపకులు కూడా పాల్గొని, వారి విలువైన సూచనలతో కొత్త సిలబస్ రూపకల్పనకు సాయపడ్డారు. విద్యాపరమైన పురోగతిలో ముందంజలో ఉండడానికి, సమాజ అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను తీర్చిద్దిడంలో గీతం నిబద్ధతను ఈ కార్యశాల ప్రతిబింబించింది.