పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ప్రాధాన్యతను తెలియజేస్తూ వారి ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీల సేవలు ప్రశంసనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అంగన్వాడి శాఖ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన పోషన్ అభియాన్-పోషణ మాసం కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం సామూహిక శ్రీమంతాలు, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలను ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోషకాహార లోపంతో ఎదుగుదలలేని పిల్లల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోందని, తక్కువ బరువుతో పుట్టే పిల్లలు, బలహీనంగా ఉంటే గర్భిణీలు, మాత శిశు మరణాల సంఖ్య తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తోందని తెలిపారు. గర్భిణీలకు, బాలింతలకు, కిషోర బాలికలకు పోషకాహార ప్రాధాన్యతను తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. నియోజకవర్గంలో అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్, ఐసిడిఎస్ ప్రాజెక్టు మేనేజర్ సురేష్, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.

