పటాన్ చెరు
విద్య ద్వారా సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ఉచితంగా కేజీ టు పీజీ అందిస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 52 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల, కళాశాలలకు పక్కా భవనాలు నిర్మించడం తో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి ఉచితంగా పుస్తకాలు, భోజనం, ఏకరూప దుస్తులు అందించడంతో పాటు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు.
తాను విద్యనభ్యసించిన పటాన్చెరు జిల్లా పరిషత్ పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. త్వరలోనే మరో 50 లక్షల రూపాయలతో అదనపు తరగతుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యా విద్యా సంస్థలను ప్రభుత్వం బలోపేతం చేసింది అన్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గురుకుల విద్యాలయాలను ప్రారంభించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మండల విద్యాధికారి రాథోడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, సిబ్బంది, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..