_అమీన్పూర్ లో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ
అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు దివంగత నందమూరి తారక రామారావు శతజయంతి పురస్కరించుకొని అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ మండే మార్కెట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అమీన్పూర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి గొప్పతనాన్ని చాటిచెప్పిన మహోన్నత నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తన నటనతో కోట్ల మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకోవడంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి వినూత్న పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్ కే దక్కిందన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కులం మతం ప్రాంతం తేడా లేకుండా అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.