మనవార్తలు ,పటాన్ చెరు
గ్రామీణ స్థాయిలో బాల బాలికలు, గర్భవతులకు పోషకాహారం అందించడంతో పాటు, ప్రీస్కూల్ ద్వారా నాణ్యమైన విద్యను అందించడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని శాంతి నగర్ కాలనీలో జి వి ఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సౌజన్యంతో 2 లక్షల 50 వేల రూపాయలతో నిర్మించిన అంగన్వాడి కేంద్ర భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిధిలావస్థలో ఉన్న భవనాన్ని పూర్తిగా తొలగించి ఆధునిక వసతులతో నూతన భవనాన్ని నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ అవకాశాన్ని స్థానిక మహిళలు, బాల బాలికలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మండల విద్యాధికారి రాథోడ్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు విజయ్ కుమార్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.