డిఆర్డిఏ, మెప్మ, రెవెన్యూ, ఎక్సైజ్, హెచ్ఎండిఎ శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష

politics Telangana

మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట

మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి కేటాయింపులు

మహిళా సమాఖ్య భవనాలు నిర్మాణాలకు నిధులు

అధికారిక కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులకు ప్రథమ ప్రాధాన్యత

స్లాటర్ హౌస్, కుల సంఘాలు, సబ్ స్టేషన్ల ఏర్పాటుకు స్థలాలు కేటాయింపు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

సమాజంలో మహిళల ఆర్థిక స్వావలంబన, సామాజిక అభివృద్ధి, కుటుంబ సంక్షేమంలో మహిళా సంఘాలు (స్వయం సహాయక సంఘాలు) కీలక పాత్ర పోషిస్తున్నాయని నియోజకవర్గ పరిధిలోని ప్రతి స్వయం సహాయక సంఘానికి నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా రుణాలు మంజూరు చేయడంతో పాటు వారి అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అతి త్వరలో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్లు ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలు కేటాయించబోతున్నట్లు తెలిపారు. బుధవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిఆర్డిఏ, మెప్మ, యుడిసి, రెవెన్యూ, ఎక్సైజ్, హెచ్ఎండిఏ, శాఖల అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు, మున్సిపాలిటీలు, డివిజన్ల ఏర్పాటుతో మహిళా సంఘాల సమాఖ్యలు డిఆర్డిఏ పరిధితో పాటు మెప్మా, యూడీసీల పరిధిలోకి వెళ్లడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ప్రతి మహిళా సంఘానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో రుణాలు మంజూరు చేయాలని డిఆర్డిఏ పిడి జ్యోతి కి సూచించారు. మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతి కోసం కొల్లూరు లో పెట్రోల్ బంక్, గుమ్మడిదల మండలం కొత్తపల్లిలో రైస్ మిల్ ఏర్పాటుకు పరిపాలన అనుమతులు మంజూరయ్యాయని త్వరలో వీటి ఏర్పాటుకు భూ కేటాయింపులు చేయనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల అభ్యున్నతి కోసం చేపట్టే కార్యక్రమాలను స్థానిక ప్రజా ప్రతినిధుల ద్వారానే చేపట్టాలని సూచించారు. గుమ్మడిదలలో మండల స్థాయి మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి సిఎస్ఆర్ నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు.

డ్రగ్స్ నివారణకు సమగ్ర ప్రణాళిక

సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులు సమన్వయంతో సమగ్ర ప్రణాళికను రూపొందించుకోవాలని ఎమ్మెల్యే జిఎంఆర్ సంబంధిత అధికారులకు సూచించారు. ప్రధానంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు శివారు కాలనీలు, పారిశ్రామికవాడలలో వీటి వినియోగం ఎక్కువగా సాగుతుందని తనకు ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. నిరంతరం నిఘా పెడుతూ డ్రగ్స్ వినియోగం, విక్రయాలను కట్టడి చేయడంతో పాటు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు.

చెరువుల అభివృద్ధి పనులను వేగవంతం చేయండి

పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు, తిమ్మక్క చెరువు, దోషం చెరువుల సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే జిఎంఆర్ సూచించారు. మూడు చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరైన పనులు నత్త నడకన కొనసాగడంపై అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత ఏజెన్సీ లతో సమన్వయం చేసుకుంటూ నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని జిహెచ్ఎంసి చెరువుల విభాగం డిఈ అనిల్ ను ఆదేశించారు.

అమీన్పూర్ డివిజన్ పరిధిలోని వడకపల్లి కోట అభివృద్ధి కోసం ఎన్ ఓ సి జారీ చేయాలని ఇప్పటికే కలెక్టర్ ను కోరడం జరిగిందని.. వెంటనే మంజూరు చేసేలా అధికారులతో సమన్వయం చేయాలని అమీన్పూర్ తహసిల్దార్ వెంకటేశంకు సూచించారు. లేనిపక్షంలో కోట అభివృద్ధి కోసం హెచ్ఎండిఏ ద్వారా మంజూరైన పది కోట్ల రూపాయల నిధులు వెనక్కి వెళ్ళిపోతాయని తెలిపారు.అమీన్పూర్ డివిజన్ పరిధిలోని లాలాబావి కాలనీ, చక్రపురి కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం గతంలో శంకుస్థాపన చేయడం జరిగిందని హైడ్రా పేరుతో పనులు ఆపడం సమంజసం కాదని అన్నారు. రెవెన్యూ శాఖ అధికారులు హైడ్రా అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. అన్ని శాఖల అధికారులు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో డిఆర్డిఏ పిడి జ్యోతి, అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ సూర్యారావు, తహసిల్దారులు, వెంకటేష్, హరిబాబు, హెచ్ఎండిఏ డి ఈ రామారావు, ఎక్సైజ్ సీఐ పరమేశం, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *