జాతీయ స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తెలంగాణ జట్టు
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 కబడ్డీ జూనియర్స్ పోటీలలో నాలుగో స్థానం సాధించిన తెలంగాణ జట్టుకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పోటీలలో పాల్గొన్న జట్టు సభ్యులకు ఎమ్మెల్యే జిఎంఆర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జట్టు జాతీయస్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం పట్ల అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి మెరుగైన ప్రదర్శనలతో జాతీయస్థాయి క్రీడలకు ఎంపిక కావడం సంతోషకరమన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర జాతీయ క్రీడలకు కేంద్రంగా పటాన్చెరుని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, జట్టు మేనేజర్ గోపాల్, పృథ్వీరాజ్, తదితరులు పాల్గొన్నారు.
