అర్హులందరికీ రేషన్ కార్డులు
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
అర్హతలున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తున్నామని, నూతన రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎంపీడీవో సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, పట్టణాలు, డివిజన్లకు సంబంధించిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా నూతన రేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చించి రేషన్ దుకాణాల ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తోందని తెలిపారు. డబ్బుల కోసం రేషన్ బియ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించ వద్దని విజ్ఞప్తి చేశారు. అలా విక్రయిస్తే శాశ్వత ప్రాతిపదికన రేషన్ కార్డులు రద్దు చేస్తామని హెచ్చరించారు. చిన్నచిన్న కారణాలతో రేషన్ కార్డుల దరఖాస్తులను తిరస్కరించవద్దని అధికారులకు ఆదేశించారు.నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని.. మీసేవ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని కోరారు. మొదటి విడతలో నియోజకవర్గ వ్యాప్తంగా 2096 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు అందించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి స్వరూప, నియోజకవర్గ ప్రత్యేక అధికారి దేవుజా, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, వెంకట్ రెడ్డి, దశరథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజు, ఆయా మండలాల తహసిల్దారులు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.
