మనవార్తలు,పటాన్‌చెరు:
విద్యావేత్త, ఎన్ఐటీ వరంగల్ పూర్వ అధ్యాపకుడు ప్రొఫెసర్ పువ్వాడ రమేష్ రచించిన మైక్రోకంట్రోలర్ అండ్ ఇంటర్ఫేసింగ్ అనే పుస్తకాన్ని శుక్రవారం గీతం కెరీర్ గైడైన్స్ సెల్ కాన్ఫరెన్స్ హాల్లో గీతం డ్రీమ్డ్ యూనివర్సిటీ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ ఆవిష్కరించారు. స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ, సీఎస్ఈ విభాగాధిపతులు ప్రొఫెసర్ టీ.మాధని, ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్, ప్రొఫెసర్ కె.మంజునాథాచారి, ప్రొఫెసర్ పి.త్రినాథరావుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ శివప్రసాద్ మాట్లాడుతూ వైద్యంలో సమకాలీన అనువర్తనానికి సంబంధించిన అంశాలపై ప్రొఫెసర్ రమేష్ ఆలోచనల సంకలనమే ఈ పుస్తకం అన్నారు. కాగా రచయిత వరంగర్ ఎన్ఐటీలో పనిచేసిన ప్రొఫెసర్ పువ్వాడ రమేష్, ఆ తరువాత మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయంలో సేవలందించారు.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో బోధన, పరిశోధనలో దాదాపు 40 ఏళ్ళకు పైగా అనుభవం ఆయన సొంతం, బయో మెడికల్ ఇంజనీరింగ్ పరిశోధనలో ప్రొఫెసర్ రమేష్ కు అపారమైన అనుభవం ఉంది. అంతర్జాతీయ జర్నల్స్, సదస్సులో ఆయన దాదాపు వందకు పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించారు. విద్య, పరిశోధన రంగాలలో ఆయనకున్న అనుభవాన్ని పంచుకునేందుకు గాను వివిధ దేశాలను ఆయన సందర్శించారు.