పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెనైస్ (జీఎస్ హెచ్ఎస్)లోని సెక్షాలజీ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ‘మార్క్ ఫర్ మెంటల్ హెల్త్’ని నిర్వహించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దుర్గేష్ నందినీ నేతృత్వంలోని ఈ మార్చ్, జ్ఞానాన్ని మెరుగుపరచడం, అవగాహన పెంపొందించడం, మానసిక ఆరోగ్యాన్ని విశ్వవ్యాప్త మానవ హక్కుగా ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.మానసిక ఆరోగ్య సమస్యలపై ప్రపంచ అవగాహన పెంచడానికి 1992 నుంచి ప్రతియేటా అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ‘మానసిక ఆరోగ్యం సార్వత్రిక మానవ హక్కు’ అనే ఇతివృత్తంతో వ్యక్తులు, సంఘాలు ఏకం కావడానికి, ప్రజలందరికీ మానసిక ఆరోగ్యం అత్యున్నత ప్రమాణంగా పేర్కొనడానికి ఇదో అవకాశంగా ఉపయోగపడుతుంది.జీఎస్ హెచ్ఎస్ అండర్-పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు గీతం ప్రాంగణం చుట్టూ మార్చ్ నిర్వహించారు. మానసిక ఆరోగ్యం గురించి అవగాహనను వ్యాప్తిచేయడం, మానసిక ఆరోగ్య ప్రమాదాల నుంచి వ్యక్తులను రక్షించడంపై దృష్టి సారించారు.
మానవ శ్రేయస్సుకు మంచి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనదిగా డాక్టర్ దుర్గేష్ నందినీ అభివర్ణించారు. దురదృష్టవశాత్తు, విశ్వవ్యాప్తంగా ఎనిమిది మంది వ్యక్తులలో ఒకరు మానసిక ఆరోగ్య పరిస్థితులలో జీవిస్తున్నారని, అది వారి శారీరక ఆరోగ్యం, శ్రేయస్సు, ఇతరులతో అనుబంధం, జీవనోపాధిపై ప్రభావం చూపుతోందని విచారం వెలిబుచ్చారు. ఇతర అధ్యాపకులు డాక్టర్ రితుమ ఓరుగంటి, డాక్టర్ నవ్య, డాక్టర్ శ్రేయ, డాక్టర్ శ్రీస్నిగ్ద దిట్టకని తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.