_సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకం తో నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీళ్లు
_పటాన్చెరు నియోజకవర్గం టార్గెట్ పదివేలు
మనవార్తలు , పటాన్ చెరు:
ఈనెల 21వ తేదీన నారాయణఖేడ్ లో సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకం శంకుస్థాపన సందర్భంగా నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు పటాన్చెరు నియోజకవర్గం నుండి పదివేల మంది కార్యకర్తలు తరలి రావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కోరారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారని తెలిపారు. శనివారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకం పూర్తయితే నాలుగు లక్షల ఎకరాల భూములు సాగులోకి వస్తాయని తెలిపారు. నారాయణఖేడ్ లో నిర్వహించబోయే సభకు పటాన్చెరు నియోజకవర్గం నుండి పదివేల మందిని జనసమీకరణ చేయాలని కోరారు. గ్రామస్థాయి నుండి నియోజక స్థాయి వరకు గల ప్రతినాయకుడు బాధ్యత తీసుకొని సభ విజయవంతానికి కృషి చేయాలని ఆయన కోరారు. మధ్యాహ్నం 1:00 లోపు ప్రతి ఒక్కరు సభా ప్రాంగణానికి చేరుకోవాలని, ఇందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు.