_రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు
_తాజా మాజీ సర్పంచులకు ఘన సత్కారం
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
ప్రజాస్వామ్యంలో పదవులు అత్యంత బాధ్యతతో కూడుకున్నవని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తే ప్రజల ఆశీర్వాదం పొందవచ్చని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో.. తాజా మాజీ సర్పంచులకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాల సర్పంచులు, ఉపసర్భంచులను శాలువా, మేమొంటో తో సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదంతో ఐదు సంవత్సరాల పాటు గ్రామాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఐదు, ఆరు నెలల పాటు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని, అప్పటివరకు గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి బాధ్యతతో పనిచేయాలని కోరారు. గ్రామాల అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ది కాలంలో ప్రతి పల్లెను ప్రగతికి ప్రతీకగా తీర్చిదిద్దామని తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా జనాభా సంఖ్య కు అనుగుణంగా ప్రతినెల నిధులు విడుదల చేస్తూ మౌలిక కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల మూలంగా జాతీయస్థాయి అవార్డులు సైతం తెలంగాణ పల్లెలు అందుకున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీలు దేవానందం, సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జడ్పిటిసిలు సుప్రజా వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.