అంతర్ విశ్వవిద్యాలయ ‘కబడ్డీ మహిళా ఛాంపియన్ షిప్ 2024-25’కు పోటీ
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రతిష్టాత్మకమైన దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయ ‘కబడ్డీ మహిళా ఛాంపియన్ షిప్ 2024-25’లో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం బాలికల జట్టు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు క్రీడల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.నారాయణరావు చౌదరి గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఛాంపియన్ షిప్ తమిళనాడులోని కరైకుడిలోని అలగప్ప విశ్వవిద్యాలయంలో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు జరుగుతుందన్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ పోటీలను భారతీయ విశ్వవిద్యాలయాల అసోసియేషన్, అలగప్ప విశ్వవిద్యాలయంలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని తెలియజేశారు.గీతం కబడ్డీ జట్టు విశాఖపట్నం, హైదరాబాదు, బెంగళూరులో ఉన్న మూడు ప్రాంగణాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన అథ్లెట్ల యొక్క శక్తివంతమైన సమష్టి శక్తిగా డాక్టర్ నారాయణరావు అభివర్ణించారు. కఠినమైన ఎంపిక ప్రక్రియను అనుసరించి, జట్టు సభ్యులు తమ నైపుణ్యాలను, పోటీతత్త్వాన్ని ప్రాంతీయ వేదికపై ప్రదర్శించడానికి ఎంపిక చేశామన్నారు. విద్యార్థులలో క్రీడలు, శారీరక ధారుఢ్యాన్ని ప్రోత్సహించడంలో గీతం నిబద్ధతకు ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.టోర్నమెంటు కోసం సన్నాహకంగా, గీతం ఉన్నతాధికారులు, స్పోర్ట్స్ డైరెక్టర్ తదితరులు జట్టు సభ్యులకు తమ హృదయ పూర్వక మద్దతు, ప్రోత్సాహాన్ని అందించడమే గాక జట్టు సామర్థ్యాలపై విశ్వాసం వ్యక్తం చేసినట్టు తెలిపారు. గీతం జట్టు విజయవంతమైన ఫలితంగా తిరిగి రావాలని వారంతా ఆకాంక్షించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.