పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సవాళ్ళను స్వీకరించని వ్యక్తి ఏమీ సాధించలేడని, సవాళ్ళను ఎదుర్కొని నిలబడాలని, దృఢంగా ఎదగాలంటే.. మరింత కష్టపడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ డీఐజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ (ఐఈటీఈ) అధ్యక్షుడు ప్రొఫెసర్ వి. గుణశేఖర్రెడ్డి ఉద్బోధించారు. హెదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థుల వార్షిక వేడుక ‘ప్రమాణ – 2023’ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.
అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు కోరుకున్న ఫలితాలను సాధించడానికి మరింత కృషి చేయాలని సూచించారు. నుంచి భవిష్యత్తు కోసం కలలు కని, వాటిని సాకారం చేసుకోవడానికి నిర్విరామంగా పనిచేయాలన్నారు. పోలీసు అధికారిగా తాను ఎన్నో సవాళ్ళను స్వీకరించడం వల్ల. మరెన్నో అవకాశాలు, విజయాలు తనను వరించాయంటూ పలు ఉదాహరణలను ఆయన వివరించారు. ప్రమాణ వంటి పండుగలు ఒకరి సృజనాత్మక ఆలోచనను మరొకరితో పంచుకోవడానికి, ఎంచుకున్న రంగంలో రాణించడానికి, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని పూర్వ డీఐజీ చెప్పారు.
చక్కగా ప్రణాళికలు రచించి, క్రమపద్ధతిలో పనిచేసి, విజయతీరాలను చేరుకోవాలని గీతం విద్యార్థులకు సూచించారు.గీతం హెదరాబాద్ ఆదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు వార్షిక పండుగ ప్రమాణను ఆరంభించినట్టుప్రకటించారు. ప్రమాణ-2023 చెర్మన్ డాక్టర్ సి. త్రినాథరావు తన స్వాగతోపన్యాసంలో అతిథులను ఆహ్వానించడంతోపాటు మూడు రోజులు జరిగే కార్యక్రమాలను ఏకరువు పెట్టారు. విద్యార్థి సమన్వయకర్త ఎం.వేదప్రజ్ఞ రెడ్డి వందనసమర్పణతో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసింది.
ఈ ప్రారంభోత్సవంలో చూర్ణిక ప్రియ చేసిన స్వాగత నృత్యం ఆహూతులందరినీ అలరించింది. ప్రారంభోత్సవం తరువాత వర్క్‌షాపులు, బ్రెజర్ హంట్, బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్, టోక్కో టౌన్ అనిమే మీట్ అప్, నటీనటులను స్ఫురణకు తెచ్చేలా సాగిన కార్నివాల్, సంగీత నృత్య ప్రదర్శనలు జరిగాయి. భారతీయ నేపథ్య గాయకుడు శ్రీరామచంద్ర, హారిక నారాయణలు తెలుగు-హిందీ పాటలతో ఉర్రూతలూగించారు.