_చిట్కుల్, లకడారం చెరువుల్లో చేప పిల్లల పంపిణీ
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని, ఇందుకు అనుగుణంగా 18 సంవత్సరాలు నిండిన ముదిరాజులు, గంగపుత్రులు మత్స్యకార సొసైటీల్లో సభ్యత్వం తీసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్చెరు మండల పరిధిలోని చిట్కుల్, లక్డారం గ్రామాల పరిధిలోని చెరువుల్లో ఆదివారం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి 5 లక్షల 21 వేల చేప పిల్లలను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత్స్యకార రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నీలి విప్లవం సృష్టించారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడంతో పాటు, విస్తృత స్థాయిలో మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని తెలిపారు. మత్స్యకారులు ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. ప్రజలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతుగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమాల్లో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, సర్పంచులు సువర్ణ మాణిక్ రెడ్డి, నీలం మధు, స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్యకార సహకార సంఘం ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.