హరిత హారం ప్రారంబించిన ఎమ్మెల్యే…
పటాన్ చెరు:
భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలన్న సమున్నత లక్ష్యం తో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఆకుపచ్చ తెలంగాణగా తీర్చిదిద్దాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.ఏడో విడత హరితహారం, నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా మొదటి రోజైన గురువారం బానూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మొక్కలు నాటారు.అనంతరం గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలోఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర భూభాగంలో 24 శాతంగా ఉన్న అటవీ ప్రాంతాన్ని 33 శాతానికి పెంపొందించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.ఇందుకు అనుగుణంగా ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.వాతావరణంలో ప్రాణవాయువును పెంచడంతోపాటు, పర్యావరణ సమతుల్యం లక్ష్యంగా హరితహారం ముందుకు సాగుతోందని తెలిపారు. నాటిన చెట్లను సంరక్షించేందుకు సైతం ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని తెలిపారు. పారిశ్రామిక వాడగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ప్రతి ఒక్కరిని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, దశరథ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.