గీతం అంతర్జాతీయ సదస్సులో స్పష్టీకరించిన వక్తలు * ఘనంగా ప్రారంభోత్సవం
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంటుందని, అందరూ తమవంతు సామాజిక బాధ్యతగా పర్యావరణ హిత చర్యలు చేపట్టాలని వక్తలు సూచించారు. గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ లోని అకౌంటింగ్ విభాగం ఆధ్వర్యంలో “పర్యావరణ, సామాజిక, పాలనలో సమకాలీన సమస్యలు’ (ఈఎస్ జీ ) అనే అంశంపై శుక్రవారం రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును జ్యోతి ప్రజ్వలతో ఘనంగా ప్రారంభించారు. అంతర్జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఐఎస్ డీసీ ), నాబార్డుల సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా నాబార్డు జనరల్ మేనేజర్ పీ.టీ.ఉష, అరబింబో ఫార్మా సలహాదారు డాక్టర్ జేవీఎన్ రెడ్డిలు పాల్గొనగా, ఐఎస్ డీసీ కార్యనిర్వాహక డైరక్టర్ తెరసా జాకబ్స్ కీలకోపన్యాసం చేశారు.
ఈఎస్ జీ సమకాలీన స్వభావాన్ని, స్థిరమైన అభివృద్ధిని సాధించడంలో ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సవాళ్లను ఉష, ప్రస్తావించడంతో పాటు గ్రామీణ ప్రాంతాలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్వయం సమృద్ధి కోసం నాబార్డు చేసడుతున్న పలు పథకాలను ఆమె ఏకరువు పెట్టారు. ఈఎస్ జీ తన ఆలోచనలను జేడీఎన్ రెడ్డి సదస్యులతో పంచుకోవడంతో పాటు అన్ని పరిశ్రమలలో సుస్థిరత యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. అరబిందో ఫార్మా పరిశ్రములో చేపడుతున్న పర్యావరణ హిత కార్యక్రమాలు, సౌర విద్యుత్ వినియోగం వంటి పలు అంశాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ప్రతి ఒక్కరూ ప్రాకృతిక వనరులను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారని, ఈ భూమిని కాపాడుకోవడానికి అంతా తమవంతు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈఎస్ జీలో వ్యక్తిగత బాధ్యత, పాలనా సూత్రాల శక్తిని తనదిన శైలిలో తెరెసా జాకబ్స్ వివరించారు. ప్రతి పౌరుడూ తన సామాజిక బాధ్యతలో భాగంగా పర్యావరణ హిత కార్యకలాపాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.కార్పొరేట్ వ్యూహాలు, పెట్టుబడి నిర్ణయాలు, సామాజిక పురోగతిలో ఈఎస్ జీకి పెరుగుతున్న ప్రాముఖ్యతలను గీతం బీ-స్కూల్ ఇన్చార్జి డైరక్టర్ డాక్టర్ దివ్య కీర్తి గుప్తా నొక్కి చెప్పారు. ఈ రంగంలోని సవాళ్లు, అవకాశాలపై అర్థవంతమైన చర్చ, విభిన్న దృక్కోణాలను ఆవిష్కరించడం కోసం ఈ వేదికను ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు.ఈ రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వాహకుడు డాక్టర్ జీఆర్ కె ప్రసాద్ వందన సమర్పణతో ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసింది. శనివారం వరకు కొనసాగనున్న ఈ సదస్సులో భాగంగా, ఈఎస్ జీపై చర్చాగోష్టులు, నిపుణులతో ప్రసంగాలను కూడా నిర్వహిస్తున్నారు.