పెప్టైడ్, న్యూక్లియోటైడ్ లలో అపార అవకాశాలు

Telangana

_ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న డాక్టర్ నవీన్

– క్లినికల్ డేటా సైన్స్ పై ముజీబుద్దీన్ చర్చాగోష్ఠి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పెప్టైడ్ లు, న్యూక్లియోటైడ్ లలో అపార వాణిజ్య, పరిశోధన అవకాశాలు ఉన్నాయని, ఔషధ పరిశ్రమలో వాటికి ప్రాధాన్యం పెరుగుతోందని డాక్టర్ కె. నవీన్ కుమార్, సీనియర్ టెక్నికల్ సేల్స్ మేనేజర్, రికీ గ్లోబల్ ట్రేడింగ్ జోస్యం చెప్పారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ‘వర్తమాన ఫార్మాస్యూటికల్ ఆవిష్కరణలు: పెప్టైడ్స్, బయోసిమిలర్స్’ అనే అంశంపై ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు.వచ్చే ఏడాది నాటికి ఆ పరిశ్రమ వంద బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, వృద్ధి రేటు 10 నుంచి 12 శాతం ఉంటుందని ఆ రంగ నిపుణుడు డాక్టర్ నవీన్ అంచనా వేశారు. మనదేశంలో పెప్టైడ్ మార్కెట్ 2024 నుంచి 2030 వరకు వార్షిక వృద్ధి రేటు 13.9 శాతం ఉంటుందన్నారు. అదే విధంగా ప్రపంచ పెప్టైడ్ థెరప్యూటిక్స్ మార్కెట్ విలువ 2033 నాటికి 5.9 శాతం వృద్ధి రేటుతో 76.11 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని జోస్యం చెప్పారు. పెప్టైడ్ చికిత్సా సామర్థ్యాలను వివరిస్తూ, ల్యాబ్-ఉత్పత్తి చేసిన మానవ ఇన్సులిన్, గ్రోత్ హార్మోన్ తో సహా వివిధ వ్యాధుల చికిత్సలో వాటి కీలక పాత్రను డాక్టర్ నవీన్ ప్రముఖంగా ప్రస్తావించారు.‘క్లినికల్ డేటా సైన్స్ భవిష్యత్తు ఉద్భవిస్తున్న ధోరణులు, అవకాశాలు’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో క్లినోసోల్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి సీ.ఎస్.ముజీబుద్దీన్ ప్రధాన వక్తగా పాల్గొన్నారు.

ఔషధ పరిశ్రమలో జరుగుతున్న అభివృద్ధి, పరిశోధన-అభివృద్ధి, క్లినికల్ ట్రయల్స్, ఔషధ అభివృద్ధి, ఫార్మాకోవిజిలెన్స్, తయారీ, నియంత్రణ వంటి పలు రంగాలలో ఎన్నో ఉపాధి అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. వాటిని అందిపుచ్చుకోవడానికి ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని, ఆయా రంగాలకు తగిన నైపుణ్యాలను అలవరచుకోవాలన్నారు. రెజ్యూమ్ తయారీ, స్మార్ట్ హైరింగ్ పద్ధతులు, నెట్ వర్కింగ్ ప్రాముఖ్యతలను ఆయన వివరించారు. అంతేగాక, ఆధునిక ఇంటర్వ్యూ పద్ధతులు, యజమాని అంచనాలను ప్రస్తావించారు. పోటీ ఉద్యోగ మార్కెట్లో అభివృద్ధి చెందడానికి విద్యార్థులకు ఆచరణాత్మక వ్యూహాలను అందించారు. క్లినికల్ డేటా సైన్స్, డేటా ఆధారిత ఆరోగ్య సంరక్షణ వంటివి వేగంగా వృద్ధి చెందుతున్న రంగాలుగా ముజీబుద్దీన్  పేర్కొన్నారు.విడివిడిగా జరిగిన ఈ కార్యక్రమాల అతిథులిద్దరినీ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. శివకుమార్ స్వాగతించి, సత్కరించగా, డాక్టర్ శ్రీకాంత్ గటాడి వందన సమర్పణతో ముగిశాయి. కెరీర్ గైడెన్స్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రమాకాంత్ బాల్ కూడా ఇందులో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *