గీతంలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో స్పష్టీకరించిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఆకెళ్ళ
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఆరోగ్య సంరక్షణలో నిరంతర పెట్టుబడి అవశ్యమని, ఇది ఉత్పాదకతను పెంచడంతో పాటు ప్రజారోగ్యం మెరుగుపరచడం, అసమానతలను తగ్గించడం వంటి దీర్ఘకాలిక సామాజిక ప్రయోజనాలకు దారితీస్తుందని డాక్టర్ రెడ్డీస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ళ వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో బుధవారం ‘ఫార్మాస్యూటికల్, ఆరోగ్య శాస్త్రాలలో సమగ్ర ధోరణులు’ అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆలోచనలు, ఆవిష్కరణల యొక్క శక్తివంతమైన మార్పిడికి వేదికగా ఈ సదస్సు ఉపకరిస్తోంది.
ఆర్థిక పరిమితులు, రాజకీయ సమస్యలు, మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన శ్రామిక శక్తి వంటి సవాళ్లను ప్రపంచ ఆరోగ్య సంరక్షణ రంగం (యూహెచ్ సీ) ఎదుర్కొంటోందని డాక్టర్ ఆకెళ్ళ తెలిపారు. యూహెచ్ సీని ప్రోత్సహించడంలో కీలకమైన సాధనాలుగా కృత్రిమ మేధస్సు (ఏఐ), డిజిటల్ హెల్త్ కేర్, టెలిమెడిసిన్, వ్యక్తిగతీకరించిన వైద్యం వంటి వినూత్న పరిష్కారాలను ఆయన సూచించారు. ప్రతి పౌరుడికీ మందులు సరమైనవిగా ఉండేలా మనం నిర్ధారించుకోవాలని డాక్టర్ ఆకెళ్ళ స్పష్టీకరించడంతో పాటు ఈ ప్రయత్నంలో సహకరించాలని శాస్త్రీయ సమాజానికి ఆయన పిలుపునిచ్చారు.
ఆత్మీయ అతిథిగా పాల్గొన్న సీడీఎస్ సీవో హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎ. రామ్ కిషన్ మాట్లాడుతూ, సామాన్య రోగులకు మంచి ఔషధం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, విశ్వవ్యాప్తంగా దాదాపు 7,129 వ్యాధులు ఉండగా, అందులో 85 అతి ప్రమాదకరమైనవన్నారు. ఆరోగ్య సంస్కరణలు, క్లినికల్ ట్రయల్స్, పరిశోధనలలో భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన వివరించారు. నాణ్యత, భద్రత, సామర్థ్యాన్ని నిర్ధారించడం ద్వారా సామాన్య జనాభా కోసం నూతన చికిత్సా ఔషధాలను అభివృద్ధి చేయడానికి విద్యా సంస్థలు, పరిశ్రమ, నియంత్రణ సంస్థల మధ్య అంతరాన్ని తగ్గించే సమగ్ర విధానం ఆవశక్యతను ఆయన నొక్కి చెప్పారు.ఈ కార్యక్రమంలో ఫార్మసీ డీన్ ప్రొఫెసర్ జగత్తరన్ దాస్, ప్రోవీసీ ప్రొఫెసర్ డీ.ఎస్. రావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రెడ్డీస్ ప్రధాన శాస్త్రవేత్త ప్రొఫెసర్ పరిమల్ మిశ్రా, హైదరాబాద్ నైపర్ డీన్ ప్రొఫెసర్ శ్రీనివాస్ నండూరి, పంజాబ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వినోద్ కుమార్, క్రోయేషియాలోని సెంటర్ ఫర్ ఇన్ఫర్మేటిక్స్ శాస్త్రవేత్త డాక్టర్ జురికా నోవాక్ వంటి నిపుణులు పలు అంశాలపై ప్రసంగించారు.
తొలుత, జ్యోతి ప్రజ్వలన చేసి అబ్ స్ట్రాక్ట్ పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించడంతో ఈ మూడు రోజుల సదస్సు శ్రీకారం చుట్టుకుంది. సదస్సు నిర్వాహకులు డాక్టర్ ప్రతీక్ పాఠక్, డాక్టర్ అశిష్ రంజన్ ద్వివేది స్వాగతవచనాలు పలుకగా, ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ఫార్మసీ విద్యార్థిని స్వప్నిక చేసిన కూచిపూడి నృత్యం, అధ్యాపకుడు డాక్టర్ గటాడి శ్రీకాంత్ ప్రార్థనా గీతం ప్రేక్షకులను అలరించాయి.ఈ సదస్సు శుక్రవారం వరకు కొనసాగనుంది. ఫార్మాస్యూటికల్, ఆరోగ్య శాస్త్ర రంగాలలో సహకారం, ఆవిష్కరణలు పెంపొందించే లక్ష్యంతో విభిన్న ప్రసంగాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.