పీహెచ్‌డీకి దక్షిణాఫ్రికాను ఎంచుకోండి_ గీతం విద్యార్థులకు క్వాజులు నాటల్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ రాజశేఖర్ సూచన

politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు:( రమేష్ )

విద్యా వ్యవస్థ మెరుగు కోసం దక్షిణాఫ్రికా భారీగా పెట్టుబడి పెట్టిందని, పీహెచ్‌డీ లేదా పోస్ట్ డాక్టరల్ డిగ్రీ చేయాలనుకునే వారికి అది ఓ చక్కని గమ్యమని ఆ దేశానికి చెందిన క్వాజులు నాటల్ విశ్వవిద్యాలయం ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ కె.రాజశేఖర్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్డ్ ని రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ప్రజారోగ్యం కోసం రసాయన శాస్త్రం, సంశ్లేషణ, ఔషధ ఆవిష్కరణ, జీవనమోదు పరికరాలు’ అనే అంశంపై శనివారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. భిన్న భాషలు, విభిన్న సంస్కృతుల మేళవింపుతో పాటు వైవిద్యభరితమైన ప్రకృతి శోభతో నిండిన దక్షిణాఫ్రికాలో పీహెచ్‌డీకి, పోస్ట్ డాక్టరల్ కోర్సులను అభ్యసించాలని అభిలషించే విద్యార్థులకు ఉత్తేజకరమైన వాతారణం ఉన్నట్టు డాక్టర్ రాజశేఖర్ చెప్పారు.

విద్యతో పాటు అందమైన సముద్ర తీరాలలో సేదతీరొచ్చని, గంభీరమైన పర్వతాలను అధిరోహించే వీలు కూడా ఉందన్నారు. గీతం విద్యార్థులు ఎవరైనా పీహెచ్‌డీ చేయాలనుకుంటే, మార్కులతో నిమిత్తం లేకుండా, పరిశోధన రంగంలో రాణించాలనే బలమైన కోర్కె పట్టుదల ఉన్నవారు తనను సంప్రదించవచ్చని పిలుపునిచ్చారు. వారికి ఉచిత విద్య, వసతి సౌకర్యాలతో పాటు ఒక ల్యాప్టాప్, అత్యాధునిక పరిశోధనాశాల, పరిశోధనలకు అవసరమైన రసాయనాలు, పరికరాలన్నింటినీ ఉచితంగానే సమకూరుస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఈ విషయంలో ఏవైనా సందేహాలుంటే అడగడానికి మొహమాట పడొద్దన్నారు. ‘మిమ్మల్ని ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోవద్దు, ఎవరి శక్తి సామర్థ్యాలు వారివి, కాని రాణించాలి, పైకి రావాలనే తపన ముఖ్యం’ అని డాక్టర్ రాజశేఖర్ స్పష్టీకరించారు. ఈ సందర్భంగా ఆయన చేపట్టిన పలు పరిశోధనల వివరాలు, వాటి పురోగతి, సాధించిన ఫలితాలు, వెలువరించిన పరిశోధనా పత్రాలు, వచ్చిన మేధోహక్కులను తెలియజేయడంతో పాటు బీఎస్సీ, ఎమ్మెస్సీ, విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు. విశిష్ట ఆచార్యుడు ప్రొఫెసర్ జీవీ రామారావు, స్కూల్ ఆఫ్ ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ అతిథిని జ్ఞాపికలను ఇచ్చి సత్కరించారు. స్కూల్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష్ నేతృత్వంలో నిర్వహించిన ఈ ఆతిథ్య ఉపన్యాసంలో రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సురేంద్రబాబు ఎంఎస్ స్వాగతోపన్యాసం. చేయగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేష్ కుమార్ కటారి వందన సమర్పణ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *