_భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే జిఎంఆర్
మనవార్తలు ,పటాన్ చెరు:
తెలంగాణ వీర వనిత, నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి తరాలకు తెలియజేప్పాలన్న సమున్నత లక్ష్యంతో నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు పట్టణంలోని జాతీయ రహదారి పక్కన గల సాకి చెరువు కట్టపై కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
ఆదివారం ఉదయం సాకి చెరువు కట్టపైగల తెలంగాణ అమరవీరుల స్తూపం ఆవరణలో ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో ఐలమ్మ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
