భ్రుంగి వాహనం పై విహరించిన భోళా శంకరుడు

Districts Telangana

_శ్రీగిరి లో వైభవంగా కొనసాగుతున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

_భృంగీ వాహనం పై భక్తులకు దర్శనమిచ్చిన ఆదిదంపతులు

శ్రీశైలం,మనవార్తలు ప్రతినిధి :

మకర సంక్రమణ పుణ్యకాలం ను పురస్కరించుకొని జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలమహా క్షేత్రంలో పాంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు జరిగే మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి శనివారం సాయంత్రం మేళతాళాలతో,మంగళ వాయిద్యాల నడుమ భృంగి వాహనంపై విహరించారు. మకర సంక్రాంతి వేడుకల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్ల కు శ్రీశైల దేవస్థానం అధికారులు, వేదపండితులు, అర్చకులు అక్కమహాదేవి అలంకార మండపంలో వివిధ సుగంధ పుష్పాలతో అలంకరించిన భృంగి వాహనం పై శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల మధ్య భృంగి వాహానాధీషులైన ఆదిదంపతులు ఆలయ ప్రదక్షణ చేస్తూ భక్తులకు దర్శనం ఇచ్చారు. తరువాత జానపద కళారూపాల నడుమ గ్రామోత్సవం వేడుకను వైభవంగా నిర్వహించారు. గంగాధర మండపం నుంచి మొదలైన ఉత్సవం అంకాలమ్మ గుడి, నంది గుడి , తిరిగి వీరభద్రస్వామి గుడి మీదుగా రాజగోపురం వద్దకు చేరింది. ఈ బ్రహ్మోత్సవంలో కోలాటం, చెక్కభజన,తప్పెటచిందు, బుట్ట బొమ్మలు మొదలైన కళారూపాలు భక్తులను కనువిందు చేశాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ స్వామివారి దేవాలయంలో ఉదయం చండీశ్వర పూజ, లోక కళ్యాణం కోసం చతుర్విధ పారాయణులు జపాలు , రుద్ర పారాయణలు, మండపారాధనలు, పంచావరణార్చనలు , రుద్ర హోమం వంటి కార్యక్రమాలు దేవస్థానం అర్చకులు వేదపండితులు అధికారులు నిర్వహించారు. అలాగే సాయంకాలం ప్రదోషకాల పూజలు, హోమాలు ఆగమ శాస్త్ర ప్రకారం అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. భృంగి వాహన సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిఅమ్మవార్ల సేవలో తరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో డి.పెద్దిరాజు దంపతులు, ఆలయ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *