శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రకృతితో మమేకమై, పూలను పూజిస్తూ, సమూహంగా బతుకమ్మ ఆడటం తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని, ఐక్యతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. మహిళలు బతుకమ్మ పాటలు, నృత్యాల ద్వారా తమ సంస్కృతిని తరతరాలకు అందిస్తున్నారని తెలిపారు.శ్రమ సంస్కృతికి, మహిళల ఐక్యతకు బతుకమ్మ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని ఆయన అన్నారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. మహిళలను గౌరవిస్తూ, వారి హక్కులను కాపాడుతూ, లింగ సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ ఐకమత్యంతో పండుగలను జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. ఈ సందర్భంగా మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో యాజమాన్య ప్రతినిధులు, శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కార్మికులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా నిర్వహించారు.
