మనవార్తలు ,పటాన్ చెరు :
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని, ఇటీవల వెల్లడైన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచాయని పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.శనివారం పటాన్ చెరువు పట్టణంలోని ఎంపీపీ సమావేశ మందిరంలో పటాన్చెరు, అమీన్పూర్ మండలాల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాల గురుకుల విద్యాలయాలతో పాటు, అన్ని పాఠశాలల్లో ఆధునిక వసతులతో కూడిన మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలను వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలో కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ విద్యాసంస్థలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, రుద్రారం సర్పంచ్ సుధీర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఎంఈఓ రాథోడ్, విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.